మంథనిరూరల్: పొట్టచేతపట్టుకుని కూలీపనుల కోసం స్వరాష్ట్రం విడిచి తెలంగాణకు వచ్చిన ఓ వలస కూలీ ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఝార్ఖండ్ రాష్ట్రం ఫలామౌ జిల్లా చీలిభర్వాపి గ్రామానికి చెందిన చోటు భయ్యాన్(26) మృతి చెందాడు. పోలీస్‌ల కథనం ప్రకారం.. అడవిసోమన్‌పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం జరుగుతుండగా ఈ పనులను ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు చేస్తున్నారు. సోమవారం ఉదయం చోటు భయ్యాన్‌తోపాటు మరికొందరు యువకులు సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు చెరువులో పడిపోగా ఒకరు వెనక్కి వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. చోటు భయ్యాన్ నీటిలోనే మునిగిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంథని ఫైర్ ఆఫీసర్ శివశంకర వరప్రసాద్, ఏఎస్‌ఐ మల్లయ్యగౌడ్ తమ సిబ్బంది చందర్, శ్రవణ్‌కుమార్, నరేందర్, నాగరాజుతో అక్కడకు చేరుకున్నారు. చోటు భయ్యాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటికే ఆ యువకుడి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకువచ్చారు. కూలీలు కన్నీటిపర్వంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


