బహుముఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
లక్ష్యంతో ముందుకెళ్లాలి
ఉపయోగపడే కోర్సులు ఎంచుకోవాలి
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నా
సెలవుల్లో కొత్త నైపుణ్యాలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): శోధిస్తే సాధించనిది అంటూ ఏమీ ఉండదని పెద్దలు చెబుతుంటారు. ఏదో ఒక నైపుణ్య సాధనకు అభ్యాసమే మందు. పది, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటే చక్కటి భవిత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిభ, నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే ఉపయోగకరం ఉంటుందంటున్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగలుగుతారని, బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయని సలహాలిస్తున్నారు. వేసవి సెలవులను వినోదానికే పరిమితం చేయకుండా, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలంటున్నారు.
● పదోతగతి తర్వాత ప్రతిభ ఆధారంగా తీసుకునే కోర్సులు, ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన స్టెప్‌పై కసరత్తు చేయాలి. ఉపాధి చూపే కోర్సులు, పలువురి అభిప్రాయాలు తీసుకొని ముందడుగు వేయాలి.
● నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సెలవు రోజుల్లో ప్రధాన పట్టణాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు, డిజిటల్ స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి.
● ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. సెలవులు ముగిసేలోగా పట్టు సాధిస్తే భవిష్యత్‌లో ఉపాధికి డోకా ఉండదు.
● విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావ వ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం, భాషా నైపుణ్యంతో వివరించగలగడం, అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి సెలవుల్లో శిక్షణ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తుంటారు. వాటిలో చేరి సాధన చేయవచ్చు.
● నిర్మాణరంగం శరవేగంగా అభివద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనులకు డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు దొరుకుతాయి.
● మహిళలు మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. ఒక లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కొచ్చు.
● సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీటు సాధించే అవకాశముంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారు ఆ దిశగా కసరత్తు ప్రారంభించాలి. ఈ కోర్సులకు ప్రభుత్వపరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో వెసులుబాటు ఉంటుంది.
● పరీక్షలు ముగిశాక పుస్తకాలతో పనేమీ లేదని సెల్‌ఫోన్‌లో చిట్‌చాట్‌లు, టీవీతో ఎంజాయ్ చేద్దామనుకుంటే భవితను నాశనం చేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా ఫోన్‌తో కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఫోన్‌లో విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. వినియోగించుకోవాలి.
విద్యార్థులు సెలవులను సరిగ్గా వినియోగించుకోవాలి. అకాడమిక్ చదువులతో పాటు నైపుణ్యాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే సరైన కోర్సు ఎంపిక చాలా ముఖ్యం. ఉన్నత విద్యకు ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక అవసరం. డిగ్రీలో చేరాలనే వారికి ఎస్సారార్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ, ప్రిన్సిపాల్, ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల, కరీంనగర్
03. లోపలికి ఎవరడుగు పెట్టినా కొరుకుతాయి
చీల్చుతాయి కుక్కలు మాత్రం కాదు
ముప్పై రెండు ఉంటాయి ముళ్లు మాత్రం కాదు
04. ప్రాణవాయువును పీల్చుకుంటుంది
వాసనలను చక్కగా చెపుతుంది
దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది
05. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు
కలిపి ముద్దలు పెడితేనే తింటుంది ఇంత గారాబమైతే ఎలాగమ్మా!
01. ఇదో మెత్తని మాంసం ముద్ద
తీపి కారమంటూ రుచులను విడమరిచి మరీ చెప్తుంది
32 రౌడీల మధ్య నివసిస్తుంది
02. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ తాను నోరిప్పి ఒక్కమాట మాట్లాడదు
అంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా
రింగులు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది.
జవాబులు
01. నాలుక
02. చెవి
03. పళ్లు
04. ముక్కు
05. నోరు
పొడుపు కథలు
డాక్టర్ కందేపి రాణీప్రసాద్
– రచయిత్రి, పిల్లల వైద్యనిపుణులు
– సిరిసిల్ల, రాజన్నసిరిసిల్ల
పిల్లలు మీరూ పంపండి...
వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా...
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని నిపుణుల సలహా
అదనపు కోర్సులపై ఇంటర్, టెన్త్ విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచన
ఉన్నత లక్ష్యాలకు మార్గాలను అన్వేషించాలని పిలుపు
నేటి ప్రపంచంలో నైపుణ్యాలే విజయానికి కీలకం. కేవలం మార్కులు కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ రెండింటితో పాటు విద్యార్థులు బహుముఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ బలంగా ఉంటుంది. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలి. లైబ్రరీలో వార్తాపత్రికలు, పుస్తకాలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలపై అధ్యయనం చేయాలి. – వి.అంజనేయరావు,
ఇంటర్ విద్యాధికారి, కరీంనగర్
పరీక్షల తర్వాత సమయం వృథా చేయకూడదు. చిన్న చిన్న నైపుణ్యాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలుగా మారుతాయి. విద్యార్థులు తమ ఆసక్తులను గుర్తించాలి. గురువుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్యంతో ముందుకు సాగితే ఫలితం ఖాయం. పాలిటెక్నిక్‌లో ఎన్నో కోర్సులు భవిష్యత్‌కు దిక్చూసిగా ఉన్నాయి.
– డి.శోభారాణి, ప్రిన్సిపాల్,
పాలిటెక్నిక్ మహిళా కళాశాల, కరీంనగర్
పిల్లలు సెలవులను సృజనా త్మకంగా వినియోగించాలి. ఫోన్, టీవీకి పరిమితం కా కుండా కొత్త విషయాలు నే ర్చుకోవాలి. నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరం. భవిష్యత్‌కు ఉపయోగపడే కోర్సులు ఎంచుకోవాలి. తల్లిదండ్రులుగా మేము కూడా మార్గదర్శకత్వం ఇస్తాం.
– మట్ట అంజిరెడ్డి, పేరెంట్
ఇంటర్ పూర్తయ్యాక నా లక్ష్యంపై మరింత స్పష్టత వ చ్చింది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించా ను. ఇటీవలే నీట్ రాశాను. ఇప్పుడు అదనంగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలనుకొంటున్నాను. భ విష్యత్తులో మంచి స్థానం సంపాదించాలనుకుంటున్నాను. – సిరి కార్తీక
పరీక్షలు పూర్తయ్యాయి. రిజల్ట్స్ వచ్చాయి. 562 మార్కులు సాధించాను. ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాను. కానీ భవిష్యత్ కోసం ఇప్పటినుంచే ఆలోచిస్తున్నాను. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ తీసుకుంటాను. సెలవుల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోని ముందుకు వెళ్లాలనేది నా లక్ష్యం.
– ఎల్.హన్సినిరెడ్డి, విద్యార్థిని


