పైసలు కొట్టు.. కొలువు పట్టు! | - | Sakshi
Sakshi News home page

పైసలు కొట్టు.. కొలువు పట్టు!

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

● బల్దియాలో ఉద్యోగాల దందా ● కాసులు కురిపిస్తున్న ‘ఖాళీలు’ ● దండుకున్నోళ్లకు దండుకున్నంత ● విచ్చలవిడిగా అధికారుల తీరు

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

గరపాలకసంస్థలో వివిధ ‘ఖాళీ’ల భర్తీ కొంతమంది అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఖాళీని కొత్త వారితో భర్తీ చేసినా, ఉన్నవారికి ‘అప్పగించినా’.. ఆ పోస్టుకు తగినట్లుగా రేటు పలకాల్సిందే. ఇలా కనిష్టంగా రూ.50 వేలు... గరిష్టంగా రూ.2 లక్షలు చేతులు మారుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారులు తమకు లేని అధికారాలతో బల్దియాపై పెత్తనం సాగిస్తున్న తీరు, అక్రమాలకు బాటలు వేస్తోంది.

లేబర్‌ టు జవాన్‌.. రూ.50 వేలు?

నగరపాలకసంస్థలోని 66 డివిజన్లలో పారిశుధ్య పనులను శానిటేషన్‌ జవాన్లు పర్యవేక్షిస్తుంటారు. తమకు కేటాయించిన డివిజన్లలో కార్మికుల హాజరు తీసుకోవడం, కార్మికులతో వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేయించడం వీరి విధి. 66 డివిజన్లకు గానూ 52 డివిజన్లకే జవాన్లు ఉన్నారు. మిగితా డివిజన్లలో ఇన్‌చార్జీలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి డివిజన్‌కు ఒక జవాన్‌ ఉండాలనే ఆదేశాలతో ఆరుగురు పారిశుధ్య కార్మికులను అప్‌గ్రేడ్‌ చేస్తూ జవాన్లుగా నియమించారు. ఇందులో రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము చీపురు, తట్ట పట్టిన చోటే పర్యవేక్షించే అవకాశం రావడంతో రేటు గట్టిగానే పలికినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని, ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా ఈ ‘డీల్‌’ కుదిరినట్లు సమాచారం. మరో ఏడుగురు కార్మికులను జవాన్లుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా ఒకరిద్దరు అధికారులు బేరసారాలు కొనసాగిస్తున్నట్లు పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

గతంలోనూ అంతే

వివిధ కారణాలతో వారధికి సరెండర్‌ చేయడంతో ఏర్పడిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలోనూ ఒకరిద్దరు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఇప్పటికే అధికంగా ఉన్నందున కొత్తగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాన్ని ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఖాళీలు ఏర్పడ్డాయనే సాకుతో ‘నియామకాల దందా’కు తెరతీసినట్లు, ఈ వ్యవహారంలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు చేతులు మా రినట్లు సమాచారం. కారణం ఏదైనా ఖాళీల భర్తీ పేరిట కొత్త, పాత వాళ్లతో సాగుతున్న ఈ వసూళ్ల దందాపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిపెట్టి విచారణ జరిపించాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

‘నగరంలో పారిశుధ్య నిర్వహణకు ప్రతి డివిజన్‌కు ఒక జవాన్‌ ఉండాలి. ఒక్కో జవాన్‌కు రెండు డివిజన్ల బాధ్యతలు ఉంటే పర్యవేక్షణ కష్టంగా మారుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. జవాన్‌ ఖాళీలు భర్తీ చేయాలి’.. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు పాలకవర్గ సభ్యుల నుంచి వస్తున్న డిమాండ్‌ ఇది. దీంతో ప్రతి డివిజన్‌కు శానిటేషన్‌ జవాన్‌ ఉండేలా మేయర్‌, కమిషనర్లు చర్యలకు పూనుకున్నారు. ఇదే అదనుగా జవాన్ల ఖాళీలను భర్తీ చేసే సాకుతో పారిశుధ్య విభాగానికి చెందిన అధికారులు అక్రమ వసూళ్ల దందాకు తెరలేపారు’.

‘నగరపాలకసంస్థ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను గతంలో వివిధ కారణాలతో వారధికి సరెండర్‌ చేశారు. దీంతో పలుశాఖల్లో ఖాళీలు ఏర్పడి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 13 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొద్ది నెలల క్రితం తీసుకొన్నారు. ఈ ‘ఖాళీ’ లను భర్తీ చేసే క్రమంలోనూ పారిశుధ్య విభాగ అధికారులు ఒకరిద్దరు వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులున్నాయి.

చర్యలు తీసుకోవాలి

నగరపాలకసంస్థలో కొద్దిరోజులుగా నియామకాల పేరిట జరుగుతున్న పారిశుధ్య అధికారుల అక్రమ కలెక్షన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎలాంటి ప్రామాణికత లేకుండానే పారిశుధ్య కార్మికులను జవాన్లుగా నియమిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పేరిట జవాన్‌లను నియమిస్తూ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించి, కొంతమంది అధికారులు రూ.లక్షలు దండుకొంటున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

– గుగ్గిళ్లపు రమేశ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌

Advertisement
 
Advertisement
Advertisement