యూసీఎఫ్‌కు ఓకే! | - | Sakshi
Sakshi News home page

యూసీఎఫ్‌కు ఓకే!

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

రూ.895 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం? నేడు నగరానికి రానున్న కేంద్ర బృందం ఫలిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కృషి

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌: నగరపాలకసంస్థను అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) పథకంలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గతంలో స్మార్ట్‌సిటీ కింద ఎంపికై న కరీంనగర్‌ వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చెందడం తెలిసిందే. మరోసారి అదే స్థాయిలో యూసీఎఫ్‌ కింద నిధులు వరద రానుంది. ఈ పథకంలో ఎంపిక కోసం ఇటీవల కౌన్సిల్‌ తీర్మాణం చేసి పంపించగా, క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శనివారం కేంద్ర అధికారుల బృందం నగరానికి రానుంది.

నేడు కేంద్ర అధికారుల బృందం రాక..

యూసీఎఫ్‌ కింద ప్రతిపాదించిన రూ.895 కోట్ల మూడు ప్రాజెక్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అంగీకరించినట్లు సమాచారం. మూడు ప్రాజెక్ట్‌ల్లో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్‌ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్‌లు, నాన్‌ మోటరైజ్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయాలతోపాటు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణం కోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు, సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.65 కోట్లు ఉన్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన అపెక్స్‌ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కమిటీ ఆదేశాల మేరకు శనివారం కేంద్ర అధికారుల బృందం కరీంనగర్‌ కు రానుంది. నగరంలో పర్యటించడంతోపాటు స్థానిక అధికారులతో సమావేశం కానున్నారు.

ఫలిస్తున్న ‘బండి’ కృషి

యూసీఎఫ్‌ పథకంలో కరీంనగర్‌ను చేర్చడంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కృషి ఫలిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ మేయర్‌ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ పాలకవర్గం ఏర్పడ్డాక యూసీఎఫ్‌ స్కీంలో కరీంనగర్‌ ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement