● దూరం పెడుతోందని అంతం చేశాడు
● వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ
● వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ
పాలకుర్తి: పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. తనను దూరం పెడుతోందని ప్రియుడే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ గురువారం వెల్లడించారు. గ్రామానికి చెందిన బౌతు సుమలత తండ్రి పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యాడు. అతనికి సేవలు చేస్తూ సుమలత జీవనం సాగిస్తోంది. కొన్నేళ్ల క్రితం గ్రామానికి చెందిన వేల్పుల స్వామితో సుమలతకు స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పలుమార్లు తన తల్లిని కొట్టడంతో పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. సుమలత తనను పెళ్లి చేసుకోవాలంటే తాగుడు మానేయ్యాలని ఆంక్షలు విధించింది. దీనికి తోడు స్వామి సెల్ నంబరును బ్లాక్‌లిస్టులో పెట్టింది. మాట్లాడడం మానేసింది. దీంతో సుమలతపై స్వామి కోపం పెంచుకున్నాడు. ఇంకెవరికో దగ్గరవుతున్నదనే అనుమానం పెంచుకున్నాడు. సుమలతను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 12వ తేదీ రాత్రి 11.40 గంటల ప్రాంతంలో తన ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న సుమలత మెడపై గొడ్డలితో ఎడమ వైపు దారుణంగా నరికి చంపాడు. గ్రామ శివారులోని వాగులో గొడ్డలి పడేసి పారిపోయాడు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై శ్రీధర్ దర్యాప్తు నిర్వహించారు. స్వామిని ఈసాలతక్కళ్లపల్లి సమక్క– సారలమ్మ గద్దెల వద్ద అదుపులోకి తీసకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు.


