‘మావో’ళ్ల జాడేది !
సిరిసిల్ల: నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మావోయిస్టు ఉద్యమానికి పెట్టని కోట. ఏ పల్లెకు పోయిన ఎర్రజెండా పాటల హోరు.. గోడలపై ‘దున్నే వాడిదే భూమి..’ అంటూ రాతలు ఆనాటి పల్లె జనాన్ని చైతన్యవంతులను చేసేవి. ఆనాటి పరిస్థితుల్లో మార్పు తెచ్చి సమసమాజ స్థాపన కోసం ఆయుధాలు పట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన వారు ప్రతీ పల్లెలో కనిపిస్తారు. అడవిలో అన్నలుగా పోరు బాటపట్టిన వారు ఎందరో. ఇదే కోవలో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన అనేక మంది ఆయుధాలు పట్టుకొని సాయుధపోరాట దారుల్లో వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో మరో ముగ్గురు అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ఆ ముగ్గురి ఆచూకీ దొరకడం లేదు. అజ్ఞాతంలోనే అదృశ్యమైన ఆ ముగ్గురు మావోయిస్టుల కోసం వారి కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు.
‘మావో’ళ్లు ఇంటికి వస్తారా.. అని ఆలోచిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో అడవిబాట పట్టి అదృశ్యమైన వారి ఆచూకీని అటు పోలీసులు.. ఇటు అజ్ఞాతం వీడిన మావోయిస్టులు కూడా చెప్పడం లేదు. ఆ మూడు కుటుంబాలకు చెందిన వారు మావోళ్లు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారోనని ఆందోళనకు గురవుతున్నారు.
28 ఏళ్ల కిందట అడవిబాట
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 28 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక అతని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ తొమ్మిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపు కోసం సైతం శ్రీనివాస్ రాకపోవడం విషాదం.
నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నారు. పదో తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నోడు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులో అనారోగ్యంతో మరణించారు. మరో సోదరుడు శంకరయ్య పదేళ్ల కిందట మృతిచెందాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా.. చంద్రయ్య ఇంటిముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదిన దేవవ్వ ధర్మారంలో ఉన్నారు. 40 ఏళ్లుగా మహేశ్ పేరుతో చంద్రయ్య మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు.
చందుర్తి నుంచి దండకారణ్యం వరకు..
చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కాంతారావు అలియాస్ నవీన్ 30 ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లాడు. చాలా కాలం మావోయిస్టు పార్టీలో కొరియర్‌గా పనిచేసిన నవీన్ దండకారణ్యంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దండకారణ్యంలో నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. కాంతారావు అలియాస్ నవీన్ ఐదేళ్ల కిందట ఒడిశాకు వెళ్లినట్లు సమాచారం. కాంతారావు ఆచూకీ 30 ఏళ్లుగా లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు.
బండి నాంపల్లి,
సోదరుడు, ధర్మారం
అజ్ఞాతంలోకి వెళ్లిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్(ఫైల్)
అడవిబాటలో అదృశ్యం
ఆ ముగ్గురు ‘అన్న’లేరి?
కుటుంబ సభ్యుల్లో ఆందోళన
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధుల లొంగుబాటు నేపథ్యంలో అయోమయం
పోలీస్ రికార్డుల్లో కనిపించని ఆ మూడు పేర్లు
రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను ప్రకటించారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు అజ్ఞాతవాసుల పేర్లు ఆ జాబితాలో లేవు. జిల్లాకు చెందిన విశ్వనాథ్(శ్రీనివాస్), బండి చంద్రయ్య(మహేశ్), బత్తుల కాంతయ్య(నవీన్) పేర్లు లేవు. దీంతో ఆ ముగ్గురి గురించి వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా మావోయిస్టు నాయకత్వం, లేదా పోలీస్ యంత్రాంగం అజ్ఞాతంలో అదృశ్యమైన ఆ ముగ్గురి గురించి పూర్తి సమాచారం వెల్లడించాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
‘మావో’ళ్ల జాడేది !
‘మావో’ళ్ల జాడేది !


