రేషన్ బియ్యం పట్టివేత
కరీంనగర్‌రూరల్: అక్రమ రేషన్ బియ్యం దందాపై టాస్క్‌ఫోర్స్, కరీంనగర్‌రూరల్‌పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిల్వ చేసిన 70క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో గురువారం కరీంనగర్‌రూరల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బొమ్మకల్ ఫ్‌లైఓవర్ బ్రిడ్జివద్ద నిఘాపెట్టారు. కిసాన్‌నగర్‌కు చెందిన గంట మల్లేశ్, లక్ష్మణ్ ట్రాలీఆటోలో సుమారు 12క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆరెపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలోని రేకులషెడ్‌లో రేకుర్తికి చెందిన పత్తి స్వామి అక్రమంగా నిల్వ చేసిన 20క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బొమ్మకల్ కృష్ణానగర్‌లోని గోదాంలో శివనాధుని సత్యనారాయణ, పుల్గం సత్తయ్యలు అక్రమంగా నిల్వ చేసిన 39క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్‌లతో పాటు టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో మొత్తం 70క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ సన్నబియ్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్‌సప్‌లై విజిలెన్స్ అధికారులకు అప్పగించామని వివరించారు.
70 క్వింటాళ్లు స్వాధీనం
ఐదుగురిపై కేసు నమోదు


