బాల్యం గుర్తుకొస్తున్నది
● బాల్యస్మృతులు గుర్తుకొస్తున్నాయి ● ఇక జీవితం ప్రజలతోనే మమేకం ● అనారోగ్యంతో..త్వరగా కోలుకోవాలని
పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్: ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ నేత కంకణాల రాజిరెడ్డిని కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 1989–90 పదోతరగతి క్లాస్‌మేట్స్ శుక్రవారం కలుసుకున్నారు. తన స్నేహితులను చూసిన రాజిరెడ్డి.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఏం చేస్తున్నారని, ఎలాఉన్నారని, వారిపరిస్థితి ఏమిటని ఆరా తీశారు. ఉద్యోగాలు చేస్తున్నామని కొందరు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామని మరికొందరు పేరుపేరునా పరిచయం చేసుకున్నారు. ఆయన కొందరిని గుర్తుపట్టగా, మరికొందరిని గుర్తుపట్టలేదు. దీంతో వారే తాము పలానా అని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయంగా, సామాజికంగా పెద్దచర్చ సాగింది.
పార్టీ కేడర్ తగ్గుతోందని..
అడవుల్లో పార్టీ పరిస్థితి, కేడర్ తగ్గిపోవడం, మారుతున్న రాజకీయ సమీకరణలతో సాయుధ పోరాటం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చ జరిగినట్లు సమాచారం. అనారోగ్యం పార్టీలోని అంతర్గత మార్పులు ఆయన్ని లొంగిపోయే ఎలా నడిపించాయనే అంశాలు చర్చకు వచ్చాయి. తుపాకీ పట్టిన చేతులతో మళ్లీ సమాజంలో గౌరవప్రదంగా ఎలా జీవించవచ్చో మిత్రులు ధైర్యం చెప్పారు.
సామాజిక మార్పులపై చర్చ
ఉద్యమం ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు ఇప్పుడు సమాజంలో ఏ రూపంలో ఉన్నాయనే దానిపై మేధావులు, మిత్రులు చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులు, సంక్షేమ పథకాలు, ఉద్యమ ఆవశ్యకతను ఎలా తగ్గించాయనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజిరెడ్డి లొంగిపోవడం అనేది ఉత్తర తెలంగాణలో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఆయన రాకతో మరికొంతమంది కేడర్ బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


