తబలా వాయించలె.. సరిగమ పాడలె
కరీంనగర్‌టౌన్: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు ఉంది ప్రభుత్వ అధికారుల వైఖరి. రూ.వేల కోట్లు వెచ్చించి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల, అధికారుల మాటలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. విద్యరంగానికి ఏటా వివిధ రకాల పేర్లతో కేటాయిస్తున్న నిధులు ఖర్చు చేసే విషయంలో చూపిస్తున్న చొరవ ఫలితాలను రాబట్టే విషయంలో ఆసక్తి చూపడం లేదు. తాజాగా కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) కింద ఎంపికై న పాఠశాలల్లో సంగీత పాఠాలు నేర్పించేందుకు జిల్లాకు మంజూరైన సంగీత వాయిద్య పరికరాలు మూలనపడ్డాయి. సంగీత పాఠాలు చెప్పే టీచర్లు లేక జిల్లాకు మంజూరైన రూ.10.50 లక్షల పరికరాలు వృథాగా ఉన్నాయి.
టీచర్ల నియామకం ఊసే లేదు
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతో పాటూ సంగీత పాఠాలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) కింద ఎంపికై న కొన్ని పాఠశాలలకు అవకాశం కల్పించింది.ఎంపిక చేసిన పాఠశాలలకు జూలైలో వాయిద్య పరికరాలు పంపిణీ చేశారు. పాఠాలు నేర్పే సంగీత ఉపాధ్యాయులను నియమించుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేయగా ఇప్పటి వరకు నియామకం చేపట్టలేదు. తరగతులు ప్రారంభించలేదు. పాఠశాలలకు పంపిణీ చేసిన తబలా, మృదంగం, హార్మోనియం, వయోలిన్, బ్యాండ్సెట్టు, డ్రమ్స్ వంటి వాయిద్య పరికరాలు నిరుపయోగంగా మారాయి.
7 పాఠశాలలకు రూ.10.50 లక్షలు
జిల్లాలోని గంగాధర, శంకరపట్నం, చొప్పదండి, కొత్తపల్లి, వీణవంక, సైదాపూర్, రామడుగు ఆదర్శ పాఠశాలలకు మొదటి విడతగా సంగీత వాయిద్య పరికరాలకు రూ.10.50 లక్షలు కేటాయించి కిట్లు అందించారు. ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షలు మంజూరయ్యాయి. ప్రభుత్వం పాఠాలు నేర్పించడానికి ఒక టీచర్ నియమించాలి. వీరికి నెలకు రూ.10 వేల చొప్పున ఉపయోగించుకోవాలని ఆరునెలల వేతనాన్ని కేటాయించారు. పాఠశాలల్లో ఒక ప్రత్యేక గదిని కేటాయించి శిక్షణ అందించాలని సూచించారు. ప్రత్యేక టీచర్ వేతనం నిధుల నుంచి చెల్లించాలని పేర్కొన్నారు. మిగిలిన నిధులను నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ దిశగా ఆరునెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియ కొనసాగడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథక లక్ష్యం అమలుకు నోచుకోవడం లేదు.
మూలనపడిన పరికరాలు
సమగ్ర సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించేలా, విద్యేతర కార్యక్రమాల్లోనూ వారు ముందుండేలా తీర్చిదిద్దాలని తీసుకొచ్చిన ఈ పథకంలో ఒక్కో బడికి ఐదేళ్లలో రూ.కోటి వరకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్రీడా సామగ్రి, ల్యాప్టాప్, ల్యాబ్ సౌకర్యాలు కల్పించారు. ఆరునెలల క్రితం ఎంపిక చేసిన పాఠశాలల్లో సంగీత పాఠాల నిమిత్తం వాయిద్య పరికరాలు అందజేశారు. కానీ, ఇప్పుటివరకు పాఠాలు ప్రారంభం కాలేదు.
తబలా వాయించలె.. సరిగమ పాడలె
తబలా వాయించలె.. సరిగమ పాడలె


