గ్రామానికో గోదాం
కరీంనగర్ అర్బన్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌ల కు ఇదో సువర్ణావకాశం. కేంద్రం గోదాంల నిర్మాణా నికి నిధులు కేటాయించనుంది. తద్వారా ప్రతి గ్రా మంలో ఏర్పా టు చేసుకోవచ్చు. కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ (వీబీ జీ రామ్‌జీ) పథకంలో అవకాశం కల్పించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ గ్రామాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాంలు నిర్మించుకునే వీలుంది. వీటిని అద్దెకు ఇవ్వడంతో పంచాయతీలకు ఆదాయం పెరిగే వీలుంది.
ఒక్కో గోదాంకు రూ.30లక్షలు
జిల్లాలో 316 గ్రామ పంచాయతీలుండగా స్థలముంటే చాలు గోదాం నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తారు. ఒక్కో గోదాం నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించారు. గోదాం నిర్మించాలంటే గ్రామంలో 444 చదరపు గజాల స్థలంలో వంద టన్నుల నిల్వ సామర్థ్యంతో నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం నిధుల్లో 60శాతం కూలీల వేతనం, 40 శాతం నిర్మాణ సామగ్రి కింద పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
జిల్లాకు రూ.94.80కోట్లు
జిల్లాకు రూ.94.80కోట్లు కేటాయించారు. స్థల పరిశీలన, పంచాయతీ తీర్మానం తదితర ప్రక్రియలో పనులను ప్రారంభించాలి. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగే సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌లో ధర ఎక్కువగా ఉంటే గోదాంల వద్దనే పంటను కొనుగోలు చేసుకునే వీలుంది. పైగా ఎక్కువ మొత్తం పంట ఉత్పత్తులు ఉన్న రైతులు గోదాంలను అద్దెకు తీసుకొని పంటను నిల్వ చేసుకునే వీలుంది. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో నిర్వాహకులు సైతం అద్దెకు తీసుకొని కొనుగోలు చేసిన సరకును నిల్వ చేసుకోవచ్చు. సీజన్ లేని సమయంలో ఇతరులకు అద్దెకు ఇవ్వడంతో పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.


