
చేతి సంచులు.. కొత్త రేషన్ కార్డులు
కరీంనగర్ అర్బన్: కొన్నాళ్లుగా కొత్త రేషన్ కార్డులకు నోచుకోని వారికి కొత్త కార్డులు మంజూరయ్యాయి. అలాగే చౌకధరల దుకాణాల్లో చేతి సంచులు ఇవ్వనున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు జూట్ బ్యాగులను వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మండలస్థాయి నిల్వ కేంద్రాలకు(ఎంఎల్‌ఎస్ పాయింట్) చేతి సంచులు చేరగా సెప్టెంబర్ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇక జిల్లాలో కొత్త రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నుంచి సరుకులు అందనున్నాయి. జూన్ వరకు 2.79లక్షల కార్డులుండగా కొత్తగా 37,474 కార్డులు మంజూరయ్యాయి.
చేతి సంచులపై పథకాల ముద్రణ
సెప్టెంబర్‌లో రేషన్ బియ్యంతో పాటు చేతి సంచులు ఇవ్వనున్నారు. రూ.50 విలువ చేసే బ్యాగును అందించనుండగా నిత్యావసర వస్తువులు, కూరగాయల విక్రయాలకు ఉపయోగపడనుంది. సదరు బ్యాగుపై ఆరు పథకాలకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సదరు బ్యాగులు చేరగా వాటిని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో కార్డుదారుకు ఒక్కో బ్యాగు ఇవ్వనున్నారు.
37,474 కార్డులకు బియ్యం
కొన్నేళ్లుగా రేషన్‌కు నో చుకోని కుటుంబాలకు ఇక సన్న బియ్యం చేరనున్నాయి. మూడునెలల క్రితం కార్డులు మంజూరు కాగా 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో బియ్యం తీసుకోలేకపోయారు. సెప్టెంబర్ నుంచి ప్రతినెలా బియ్యం పంపిణీ చేయనుండగా 37,474 కుటుంబాలకు లబ్ధి కలగనుంది. జూన్ వరకు 2.79లక్షల కార్డుదారులుండగా 10లక్షల యూనిట్లున్నాయి. తాజాగా పెరిగిన సంఖ్యతో కార్డుదారుల సంఖ్య 3లక్షలు దాటింది. కొత్త కార్డుల్లో 1,09,994 యూనిట్లు పెరగగా యూనిట్ల సంఖ్య 11 లక్షలు దాటింది. అలాగే రేషన్ కార్డుల్లో పేర్ల చేర్పులకు సంబంధించి 52,992 దరఖాస్తులను అప్రూవ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు వివరించారు.