విషపురుగు కాటుకు వ్యక్తి మృతి
సారంగాపూర్(జగిత్యాల): రోళ్ళవాగు ప్రాజెక్టు వద్ద ఎండ్రికాయలు పడుతుండగా పాముకాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బీర్‌పూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నందగావ్ గ్రామానికి చెందిన గణపతిదేవ్‌రావు టార్పే (34) తన స్నేహితుడు సూర్యభాను మారుతితో కలిసి శనివారం ఎండ్రికాయలు పట్టేందుకు బీర్‌పూర్ శివారులోని రోళ్ళవాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎండ్రికాయలు పడుతున్న క్రమంలో చీకటిగా ఉండడంతో విషపురుగు కాటువేసింది. వెంటనే సూర్యభాను మారుతి 100కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గణపతిదేవ్‌రావు టార్పేను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యహ్నం మృతిచెందాడు. మృతుడి భార్య పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిర్మల్ జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు జీవనోపాధి కోసం ఇక్కడి వచ్చి ఎండ్రికాయలు పట్టుకుని వెళ్తుంటారని పోలీసులు తెలిపారు.
కోతుల దాడిలో మహిళకు గాయాలు
హుజూరాబాద్: కోతుల దాడిలో ఆదివారం మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికుల వివరాలు.. పట్టణంలోని విద్యానగర్ మూడో రోడ్‌లో కోతుల మంద భారీ సంఖ్యలో తిరుగుతూ పుల్లూరి త్రివేణిని తీవ్రంగా గాయపరిచాయి. కోతులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ అధికారులు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
శివలింగం, నంది విగ్రహం లభ్యం
చొప్పదండి: మండలంలోని దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్తులు విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు అన్నారు. ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్ఠించాలని గ్రామంలోని నాయకులు పేర్కొన్నారు.
డబ్బులతో ఉడాయించిన వ్యాపారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లిలో బట్టల వ్యాపారులుగా స్థిరపడ్డ రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు అందినకాడికి అప్పు చేసి రూ.50లక్షలతో రాత్రికిరాత్రే ఉడాయించారు. విషయం తెలుసుకున్న రుణదాతలు లబోదిబోమంటున్నారు. బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. రాజ స్థాన్‌లోని నాగుల్‌కు చెందిన గుమాన్ రాచర్లగొల్లపల్లిలో బట్టల వ్యాపారిగా స్థిరపడ్డాడు. మ రొకరితో కలిసి వ్యాపారం కోసమని స్థానికుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పలు చిట్టీలను ఎత్తుకున్నారు. ఇద్దరు కలిసి సుమారు రూ.50లక్షలకు పైగా అ ప్పులు చేసి గుట్టుచప్పుడు ఉడాయించారు. మూడు రోజుల క్రితమే వారు గ్రామాన్ని విడిచి పరారీ కాగా.. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో అప్పులు ఇచ్చిన వారు తల పట్టుకుంటున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పరారీ అయిన వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. అప్పులిచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.


