రైతన్నపై విత్తన పిడుగు
కరీంనగర్ అర్బన్: ప్రతికూల పరిస్థితులు, మార్కెట్లో గిట్టుబాటు ధర లేమితో కునారిల్లుతున్న సాగు రంగానికి విత్తన ధరను పెంచడం ఆందోళనకర పరిణామం. తెగుళ్లు, అకాల వర్షాలతో అరకొర దిగుబడులు సాధిస్తున్న పత్తి రైతులకు తాజాగా పెంచిన పత్తి విత్తన ప్యాకెట్ ధర భారంగా మారనుంది. ఇప్పటికే విత్తన రాయితీలను ఎత్తేసిన ప్రభుత్వం తాజాగా పత్తి విత్తన ప్యాకెట్ ధరను పెంచేసింది. ప్యాకెట్ ధర రూ.901గా నిర్ణయించగా గతేడాదితో పోలిస్తే ప్యాకెట్‌కు రూ.48 పెరిగింది. ఈ లెక్కన జిల్లా రైతులపై రూ.1.44కోట్ల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఎరువులు, మందులు, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడి మరింత పెరగనుందని కర్శకులు కలవరపడుతున్నారు.
బీటీ2కే ప్రాధాన్యం
పత్తి రైతులు విత్తనాలను ప్రైవేటులోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పలు కంపెనీలు వివిధ రకాల విత్తనాలను మార్కెట్లో ప్రవేశపెట్టడంతో విత్తన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. ఏటా విత్తన తయారీ తదితర ఖర్చులను లెక్కించి ప్రభుత్వం ధరను నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన ధరకే కంపెనీలు విత్తనాలను విక్రయించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో బీటీ1, బీటీ2 రకాలు అందుబాటులో ఉన్నా ఎక్కువ మొత్తంలో బీటీ2 విత్తనాన్ని సాగు చేస్తారు. జిల్లాలో సాగు ఎక్కువగా ఉండగా ఏటా 3లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు(450గ్రాములు) విక్రయాలు జరుగుతాయి.
నకిలీ మకిలీ వీడేనా..?
పత్తి సాగు చేసే ౖరైతులు ఎకరాకు 3 సంచుల విత్తనాన్ని ఉపయోగిస్తారు. ఈ లెక్కన జిల్లా సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా 3 లక్షలకు పైగా విత్తన సంచులు అవసరం ఉంటుంది. వందల రకాల్లో విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బీటీ–2 పత్తి విత్తనాల సంచి ధర రూ.853 ఉంది. రానున్న సీజన్లో ఒక సంచి రూ.901తో విక్రయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ మొత్తంలో అవసరం ఉండటంతో ఏటా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. సదరు అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అడ్డుకట్ట పడటం లేదు. సీజన్ ప్రారంభానికి మందే జిల్లాలో నకిలీ విత్తనాలను నిల్వ చేస్తున్నారు. నమ్మకస్తుల ద్వారా చేరవేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
విత్తనాలపై స్పష్టత అవసరం
ఏటా నకిలీ విత్తనాలు నీడలా వెంటాడుతుంటే వ్యవసాయశాఖ తదనుగుణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పత్తి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇవ్వడం లేదు. ప్రయివేటు కంపెనీలే ఆధారం. ఈ క్రమంలో అసలు ఏ ఏ కంపెనీలకు అనుమతి ఉంది, ఎంత ధర, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్ల లైసెన్స్‌లు సస్పెండ్ చేయాలి. ఇక వచ్చే సీజన్లో ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కోడ్ ఏ కంపెనీ, ఎప్పుడు తయారు చేసింది, లాట్ నంబరు, విత్తన రకం తదితర వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో పలు కంపె నీలు విక్రయించిన విత్తనాలు నాసిరకమని తేలా యి. కంపెనీలు విక్రయించిన విత్తనాలతో రైతులకు నష్టం జరిగితే పరిహారం ఇప్పించేలా ఒప్పందం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పత్తి ప్యాకెట్ ధర రూ.48కి పెంపు
జిల్లా రైతులపై రూ.1.44కోట్ల భారం
జిల్లాలో సాగు విస్తీర్ణం:
3.50 లక్షల ఎకరాలు
రైతులు: 1.80లక్షలు
ఏటా పత్తి సాగు: లక్ష ఎకరాలు
గతంలో ప్యాకెట్ ధర: రూ.853
తాజా పెంపుతో ధర: రూ.901
అన్నదాతలపై భారం: రూ.1.44కోట్లు


