కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్: ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను ఉద్యోగులు సద్వినియోగం చేసుకొని నైపుణ్యం పెంచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. కలెక్టరేట్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. నోటింగ్, డ్రాప్టింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పెన్షన్ రూల్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే వీడియో ఎడిటింగ్, ఫొటోషాప్‌పై ఎంపికచేసినవారికి శిక్షణ ఇవ్వాలన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి కూడా ఉద్యోగులు శిక్షణకు హాజరవుతున్నందున అంతర్గత ఫిర్యాదుల కమిటీ గురించి వారికి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు.
టీబీపట్ల అప్రమత్తంగా ఉండాలి...
టీబీపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మెట్రోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం మోతాజ్ ఖానా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక దశలో టీబీని గుర్తించి మందులు వాడితే సులభంగా నయమవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున ప్రతీనెల టీబీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న రూ.1000 పోషకాహారానికి వినియోగించుకోవాలన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు, ఏవో సుధాకర్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్, ఇమినైజేషన్ ఆఫీసర్ సాజిద పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి