కామారెడ్డి టౌన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలోని గంజాయి, ఇతర మత్తు పదార్థాలను శనివారం దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎం. రాజేశ్‌చంద్ర తెలిపారు. శనివారం ఆయన వివరాలను వెల్లడించారు. బిచ్కుంద, జుక్కల్, పెద్దకొడప్‌గల్, ఎల్లారెడ్డి, రామారెడ్డి, దేవునిపల్లి స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో 402.184 కిలోల గంజాయి, 83 గంజాయి మొక్కలు, 286 గ్రాముల ఆల్ప్రాజోలం, 40 గ్రాముల క్లోరల్ హైడ్రేట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలోని సురక్షిత గదిలో భద్రపరిచారు. ఫోరెన్సిక్ పరీక్షలకు నమూనాలు పంపిన అనంతరం, నిజామాబాద్ జిల్లా జక్రానన్‌పల్లి మండలం పడకల్‌లోని మెడికేర్ సర్వీసెస్‌లో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మత్తు పదార్థాలను నిర్వీర్యం చేశారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలను రోడ్డున పడేస్తుందని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, డీఎస్పీ ఎస్. మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 402.184 కిలోలు నిర్వీర్యం
తొమ్మిది కేసుల్లో పట్టుబడిన సరుకును దహనం చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన
ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర


