● కలెక్టరేట్‌లో నేత్ర వైద్య శిబిరం
● 175 మందికి పరీక్షలు.. 113 మందికి కళ్లద్దాల పంపిణీ
● అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి టౌన్: అపోహలు, మూఢనమ్మకాలను వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నేత్రదానానికి ముందుకు రావాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షల శిబిరం, అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ విక్టర్, డీఎంహెచ్‌వో వెంకట్ హాజరయ్యారు. శిబిరంలో కలెక్టరేట్ సిబ్బందితోపాటు సాధారణ ప్రజలకు వైద్య నిపుణులు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 175 మందికి పరీక్షలు నిర్వహించి, దృష్టి సమస్యలు ఉన్న 113 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. కంటి సంరక్షణపై వైద్యులు అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. ఆప్తాల్మిక్ అధికారులు రవీందర్, హరికిషన్, వైద్యులు మారుతి బాబు, సంతోష్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


