చికిత్స పొందుతూ ఒకరి మృతి
బోధన్‌రూరల్: మండలంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ఏరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బానెల్లి నర్సయ్య (48) మద్యానికి బానిసై, ఈనెల 24న రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని, ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
హత్యకేసులో ముగ్గురికి పదేళ్ల జైలు
నిజామాబాద్ లీగల్: ఓ వ్యక్తిపై దాడిచేసి హత్యచేసిన కేసులో ఓ మహి ళతోపాటు ఆమె కుమారుడు, తమ్ముడికి నిజామాబాద్ కోర్టు జడ్జి హరీష పదేళ్ల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా విధించింది. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలుకా సావ్లి గ్రామానికి చెందిన బింగేవార్ రాజమణి, తన కుమారుడు రాజు, తమ్ముడు అగపట్రే మాధవ్‌లతో కలిసి కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం నిజామాబాద్ నగరానికి వచ్చింది. నగర శివారులోని అర్సపల్లిలో నివాసముంటూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అలాగే వారి సమీప గ్రామం మచ్కూరేకు చెందిన చాంద్కె తారాబాయి తన కుమారుడు చాంద్కె మాధవ్‌తో కలిసి అర్సపల్లిలోనే జీవనం సాగిస్తున్నారు. 2022లో రాజమణి గురించి తారాబాయికి కుమారుడు మాధవ్ చెడుగా చెప్పాడు. ఈ విషయం రాజమణికి తెలియడంతో 26 ఏప్రిల్ 2022న ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తున్న మాధవ్‌పై రాజమణి, రాజు, ఆగపట్రే మాధవ్ విచక్షణా రహితంగా దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన 6వ టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, కోర్టుకు తరలించారు. జడ్జి విచారణ చేపట్టి, ముగ్గురు నిందితులకు పదే ళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధించారు. ఈ కేసులో పోలీసుల తర ఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింహారెడ్డిప్రాసిక్యూషన్ నిర్వహించారు.
రెంజల్: మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ నలుగురు పట్టుబడ్డారు. సోమవారం వారిని బోధన్ కోర్టుకు తరలించగా, జడ్జి రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. వారిలో ఒకరు జరిమానా చెల్లించకపోవడంతో 7రోజుల జైలు శిక్ష విధించినట్లు వివరించారు.
వేల్పూర్: విదేశాలకు పంపిస్తానని పలువురి నుంచి డబ్బులు తీసుకొని, పరారీలో ఉన్న వే ల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఏజెంట్ కొలిప్యాక ప్రవీణ్‌ను సోమ వారం అరెస్టు చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. వేల్పూర్, ఆర్మూర్ పరిసర ప్రాంతాల విద్యార్థులకు విదేశాలలో విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి గతంలో నిందితుడు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడన్నారు. కానీ వీసాలు పంపకుండా పరారీ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు 2023లో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అతడిని అరెస్టు చేశామన్నారు.
వాహనాల చోరీ కేసులో నిందితుడు..
నిజామాబాద్ అర్బన్: నగరంలో గతంలో పలు వాహనాల చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. నగరానికి చెందిన అబ్దుల్ సల్మాన్‌ఖాన్ అనే వ్యక్తి గతంలో బర్కత్‌పురలో స్కూటీని, 4వ టౌన్ పరిధిలో కారును దొంగిలించాడు. పరారీలో ఉండగా సోమవారం బర్కత్‌పురలో అతడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కారు, స్కూటీని రికవరీ చేసినట్లు తెలిపారు.
పేకాడుతున్న నలుగురు..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిపేటలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజు సోమవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాడుతున్న వారిని పట్టుకున్నామన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.7,900 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


