నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురితోపాటు బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నాగిరెడ్డిపేట మండలం బంజార వద్ద జరిగిన ఘటన వివరాలు ఇలా.. ఎక్కపల్లితండాకు చెందిన రవీందర్, అఖిల్, శాంతి, లక్ష్మీ, సక్రంతోపాటు నాన్‌విత అనే బాలుడు సోమవారం రాత్రి బంజార తండాకు చెందిన కమ్లీ అనే వ్యక్తి ఆటోలో గోపాల్‌పేట నుంచి బంజారకు బయల్దేరారు. అదే సమయంలో గుడితండాకు చెందిన కేవ్లోత్ చోక్లా అనే వ్యక్తి తన బైక్‌పై బంజారతండా వైపు నుంచి గోపాల్‌పేట వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో బంజార విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆటో–బైక్ ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరు వాహనాలు ధ్వంసం కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురితోపాటు బైక్ నడిపిన చోక్లాకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో రవీందర్‌తోపాటు అఖిల్, నాన్‌విత్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్ రావడంలో జాప్యం కావడంతో సమాచారం అందుకున్న ఎస్సై భార్గవ్‌గౌడ్ ఘటనస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన రవీందర్, అఖిల్‌ను తానే స్వయంగా తీసుకొచ్చి పెట్రోలింగ్ వాహనంలోకి చేర్చారు. అనంతరం వారిని మెదక్ ఆస్పత్రికి తరలించారు.


