వెంకంపల్లిలో చిరుత సంచారం! | - | Sakshi
Sakshi News home page

వెంకంపల్లిలో చిరుత సంచారం!

Sep 1 2026 1:07 AM | Updated on Sep 1 2026 1:07 AM

వెంకంపల్లిలో చిరుత సంచారం! ‘నాణ్యతా ప్రమాణాలు పాటించాలి’ నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ, విశాంత్ర ఉద్యోగుల నిరసన 5 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడికి యత్నం

ఆందోళనలో గ్రామస్తులు, రైతులు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ సోమవారం తన పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా చిరుత గ్రామ శివారులోని పీర్ల కుచ్చపైకి వెళుతూ కనిపించింది. ఈ విషయం గ్రామస్తులకు తెలపడంతో వారు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్‌ సిబ్బంది గ్రామానికి చేరుకొని చిరుత ఆనవాళ్ల కోసం గాలించారు. కాగా, చిరుత సంచారానికి సంబంధించి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని నాగిరెడ్డిపేట ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్‌ తెలిపారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా ఆహార భద్రతాధికారి జి. విక్రమ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంటశాలలు, పదార్థాల నిల్వ, వినియోగిస్తున్న వంట సామగ్రి, పరికరాలను పరిశీలించారు. అపరిశుభ్రతగా ఉన్న, నిబంధనలు పాటించని పలు హోటల్‌ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.

కామారెడ్డి అర్బన్‌: డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌తోపాటు ఆయా మండలాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ విశాంత్ర ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు జేఏసీ జిల్లా చైర్మన్‌ నరాల వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలుపుతారని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ నాగరాజు, జేఏసీ కో చైర్మన్లు ఆకుల బాబు, రాములు, సయ్యద్‌ ఖలిమొద్దీన్‌, ప్రవీణ్‌కుమార్‌, మఖ్ధుల్‌, బషీర్‌, సాయిరెడ్డి తదితరులున్నారు.

కామారెడ్డి రూరల్‌: రేషన్‌ బియ్యం పంపిణీ ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు పౌర సరఫరాలశాఖ అధికారులు సోమవారం తెలిపారు. మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీ కావడంతో బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ షాపుల్లోకి దిగుమతి ఆలస్యం కావడంతో పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. దీంతో ఈ నెల 5 వరకు బియ్యం పంపిణీ తేదీని పొడిగించారు. ఇప్పటి వరకు రేషన్‌ బియ్యం తీసుకోని వినియోగదారులు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఎల్లారెడ్డి: విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయా లని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని చేపట్టారు. అందులో భాగంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రతినిధులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చరణ్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement