జిల్లాలో నాలుగేళ్లలో మద్యం అమ్మకాల వివరాలు..
● ఫంక్షన్లు, పండుగల్లో తప్పనిసరి
● అశుభ కార్యాల్లో ‘చేదిడుసుడు’ పేరుతో..
● సుట్టమొచ్చినా, దోస్తు కలిసినా
తాగుడేతాగుడు
● జిల్లాలో ఏటేటా పెరుగుతున్న
మద్యం విక్రయాలు
● నాలుగేళ్లలో రూ. 2,200 కోట్ల
మద్యం అమ్మకం
అది శుభకార్యమైనా.. అశుభకార్యమైనా.. పండుగైనా, పబ్బమైనా మద్యం ఉండాల్సిందే.ఇంటికి సుట్టమొచ్చినా.. బయట దోస్త్ కలిసినా బాటిల్ మూత విప్పాల్సిందే. ఆనందమొచ్చినా.. బాధేసినా మందు పొంగాల్సిందే. ఎవరైనా చనిపోతే సావుకు పోయిరాంగ చేదు ఇడవాలంటూ సుక్క వేయాల్సిందే. సందర్భమేదైనా తాగడం మాత్రం సర్వసాధారణమైంది. జిల్లాలో మందుబాబులు నాలుగేళ్లలో రూ. 2,200 కోట్ల మద్యం తాగడం గమనార్హం. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లాలో మద్యం అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. నాలుగేళ్ల కాలంలో రూ.2,200 కోట్ల విలువైన మద్యం తాగేశారు. లెక్కకు రాని మద్యం కూడా ఉంటుంది. ఉన్నత వర్గాల వారు డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి అలాగే విదేశీ మద్యం తెప్పించుకుంటారు. అది కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు రాష్ట్రాలనుంచి మద్యం వస్తుంటుంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రల్లో తక్కువ ధరకు లభించే దేశీదారు కొన్ని ప్రాంతాల్లో దొంగచాటుగా అమ్ముతుంటారు. తాగడానికి నీళ్లు దొరకని ఊళ్లుండొచ్చు గానీ మందు దొరకని గ్రామం ఉండదని చెబుతారు. ఊరూరా తెరుచుకున్న బెల్ట్ షాపులతో కావలసినంత మద్యం అందుబాటులోకి రావడంతో వైన్‌షాప్‌ల కోసం వెదకాల్సిన పనిలేకుండాపోయింది. కొన్ని గ్రామాల్లో అయితే ఫోన్ చేస్తే చాలు ఉన్న దగ్గరికి మందు బాటిల్ వస్తోంది. తాగడానికి కావలసిన స్టఫ్, ఫుడ్ కూడా ఆర్డర్ ఇస్తే లొకేషన్‌కు చేరుకుంటోంది. దీంతో మద్యం అమ్మకాలు మూడు సీసాలు, ఆరు గ్లాసుల్లా నడుస్తోంది.
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత అందరూ సామాజిక మాధ్యమల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. దోస్తు పుట్టిన రోజు, పెళ్లిరోజు ఉందంటే చాలు అందరూ గ్రీటింగ్స్ తెలుపుతున్నారు. చీకటి పడకముందే దోస్తులంతా కలిసి వెళ్లి కేక్ కట్ చేయిస్తున్నారు. దోస్తులంతా కలిసి మందుపార్టీలు చేసుకోవడం కామన్ అయ్యింది. అలాగే బర్త్‌డే పార్టీల్లో యువత హంగామా చేస్తున్నారు. రాత్రంతా తాగి తూగుతున్నారు.
సంవత్సరం అమ్మకాలు(రూ.కోట్లలో)
2022 529.30
2023 549.60
2024 558.79
2025 560.59


