పురపాలన ముందుకు సాగేదెలా? | - | Sakshi
Sakshi News home page

పురపాలన ముందుకు సాగేదెలా?

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

అధ్వానంగా పారిశుద్ధ్య విభాగం

జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన కామారెడ్డిలో అధికారుల కొరత వేధిస్తోంది. కీలక విభాగాల్లో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ప్రజలకు సరైన సేవలు అందడం లేదు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఆయన విధుల్లోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గత నెలలో జరిగిన మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశంలో కౌన్సిల్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌డీవో గిరికి మున్సిపల్‌ కమిషనర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన తన రెగ్యులర్‌ విధుల్లో బిజీగా ఉంటుండడంతో బల్దియాపై ఫోకస్‌ చేయలేకపోతున్నారు. పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతోంది.

అస్తవ్యస్తంగా టౌన్‌ ప్లానింగ్‌..

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ టీపీవో గిరిధర్‌ను సైతం మార్చి 28న కౌన్సిల్‌ సభ్యులు సొంత శాఖకు సరెండర్‌ చేస్తూ తీర్మానం చేశారు. అయితే ఈ సరెండర్‌ వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. ఆయన విధులకు కూడా హాజరు కావడం లేదు. టీపీఎస్‌ కావ్య కూడా దాదాపు 25 రోజులుగా సెలవులో ఉన్నారు. ఆమె ఇక్కడ విధులు నిర్వహించడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఇద్దరు టీపీవోలు, నలుగురు టీపీఎస్‌లు, నలుగురు టీపీబీవోలు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు టీపీబీవోలతోనే విభాగాన్ని నెట్టుకొస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ కరువవుతోంది. జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన 47 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఫైళ్లు పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి.

రెవెన్యూ ఆదాయంపై తీవ్ర ప్రభావం..

రెవెన్యూ విభాగం అధికారి (ఆర్‌వో) రవిగోపాల్‌ రెండు నెలలుగా సెలవులో ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. మేనేజర్‌ఏక ఆర్‌వో అదనపు బాధ్యతలు ఇచ్చారు. రెగ్యులర్‌ ఆర్‌వో లేకపోవడంతో పన్ను వసూళ్లలో లక్ష్యం చేరుకోలేకపోయారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇంకా సగం పన్నులు వసూలు కావాల్సి ఉంది. 122 మున్సిపల్‌ దుకాణాల అద్దెలు, పన్నుల వసూళ్లు సైతం నిలిచిపోయాయి. ఆర్‌వో లేకపోవడంతో 49 వార్డుల ఆఫీసర్లపై పర్యవేక్షణ కరువైంది. ఇంజినీరింగ్‌ విభాగంలో రెండు ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన విభాగాలలో ఇన్‌చార్జీల పాలన కొనసాగుతుండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజలకు సకాలంలో సరైన సేవలు అందడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక కౌన్సిలర్లు సైతం ఇబ్బందిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి అధికారులను నియమించి కామారెడ్డి బల్దియాలో పాలనను పట్టాలెక్కించాలని ప్రజలు కోరుతున్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో పాలన గాడి తప్పుతోంది. పలు విభాగాలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఇన్‌చార్జీలతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఫలితంగా సరైన పర్యవేక్షణ లేక పురపాలన, అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. – కామారెడ్డి టౌన్‌

బల్దియా సానిటరీ విభాగం రెగ్యులర్‌ అధికారులు లేక అనాథగా మారింది. సానిటరీ ఎస్సై పర్వేజ్‌ను బదిలీ చేయడం, మరో సానిటరీ ఎస్సై నగేశ్‌పై విధుల్లో నిర్లక్ష్యం కారణంగా వేటు పడడంతో పర్యవేక్షణ కరువయ్యింది. ప్రస్తుతం వాటర్‌వర్క్స్‌ ఉద్యోగి శ్యామ్‌, బిల్‌ కలెక్టర్‌ డేవిడ్‌ రాజ్‌లకు పాత, నూతన పట్టణాల ఇన్‌చార్జి సానిటరీ ఎస్సై బాధ్యతలు అప్పగించారు. వీరికి ఈ విభాగంపై అవగాహన లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్నాయి. చెత్త సేకరణ ఆటోలు, ట్రాక్టర్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారు కరువయ్యారు.

కీలక విభాగాలకు పూర్తిస్థాయి

అధికారులు కరువు

ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం

కమిషనర్‌ సరెండర్‌తో

ఆర్‌డీవోకు పాలన పగ్గాలు

ఆర్‌వో లేకపోవడంతో

మేనేజర్‌కు అదనపు బాధ్యతలు

ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి

Advertisement
 
Advertisement
Advertisement