● టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర ఉన్నత
పాఠశాల బాగుంది
● టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి
బీబీపేట: ‘‘మండల కేంద్రంలోని టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాల బాగుంది. కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థల్లోనూ ఇలాంటి సదుపాయాలు ఉండవు’ అని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బీబీపేటలో తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి సుమారు రూ. 6 కోట్లతో నిర్మించిన టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆట స్థలం, సెమినార్ హాల్, గ్రంథాలయాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలామంది వందకు వంద శాతం హాజరు కావడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాల కోసం కృషి చేస్తున్న పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డిని, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనం కోసం సుభాష్‌రెడ్డి రూ. 6 కోట్లు వెచ్చించారని, దీనికి ప్రతిఫలంగా ఆయన విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను మాత్రమే ఆశిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు.
ప్రతి గ్రామంలో ఖేల్ కూద్..
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఖేల్ కూద్ నిర్వహించడానికి జనగామ గ్రామమే నాంది అవుతుందని జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. జనగామలో తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్‌లో ఆయన పాల్గొని క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, క్రీడాభివృద్ధికి తోడ్పాటునివ్వాలని సూచించారు. కొంతమంది డ్రగ్స్, మద్యపానానికి అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సుభాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారి దృష్టిని క్రీడలపైకి మళ్లించేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం క్రీడల్లో సత్తాచాటిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో జర్నలిస్టు తెలంగాణ విఠల్, ఆయా గ్రామాల సర్పంచులు మట్ట శ్రీనివాస్, రాజేష్, హరీష్, ఉపసర్పంచ్ స్వామి, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


