రామారెడ్డి: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం గోకుల్‌తండాలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం సేకరణలో పాల్గొంటున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు త్వరగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 35,300 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి శ్రీకాంత్, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.


