రామారెడ్డి(ఎల్లారెడ్డి): ఇసన్నపల్లిలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాలభైరవ స్వామి ఆలయం వైశాఖ మాస ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేశంలో కాశీ, ఉజ్జయిని, కశ్మీర్ వంటి అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే దర్శనమిచ్చే కాలభైరవ స్వామి.. స్వయంభూవుగా కొలువుదీరడం ఈ ప్రాంత విశిష్టత వైశాఖ మాసం సందర్భంగా ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారికి నిర్వహించే అలంకారాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పురాణ ప్రాశస్త్యం ప్రకారం ఈ నెలలో స్వామివారిని దర్శించుకోవడం అత్యంత ఫలదాయకమని భక్తుల నమ్మకం. మంగళవారం స్వామివారిని 108 రకాల పండ్లతో అలంకరించారు. వైశాఖ మాసంలో నిర్వహించే ఈ 108 రకాల అలంకారాలను చూడటం ఒక అదృష్టం అని ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ తెలిపారు.


