కో– ఆప్షన్‌ పదవి ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

కో– ఆప్షన్‌ పదవి ఎవరికో?

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

ముఖ్య నేతల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్న ఆశావహులు

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించి నెల పదిహేను రోజులు కావస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికపైనే చర్చ కొనసాగుతోంది. కో–ఆప్షన్‌ ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. మున్సిపల్‌ రాజకీయంలో కొత్త దళం అడుగుపెట్టగా బాన్సువాడ పట్టణంలో స్థానిక లాబీయింగ్‌ మరింత ఊపందుకుంది.

రెండు మూడు రోజుల్లో స్పష్టత..

బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు 11 వార్డులు కాంగ్రెస్‌ గెలిచింది. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ దక్కని వారు నిరాశ పడకుండా ముఖ్య నాయకులు కో–ఆప్షన్‌ ఇస్తామని సర్ది చెప్పి పోటీ నుంచి తప్పించారు. కాంగ్రెస్‌ నాయకులు కొందరు కో–ఆప్షన్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే గతంలో బాన్సువాడ మున్సిపాలిటీకి నాలుగు కో–ఆప్షన్‌ పదవులు కేటాయించారు. నాలుగు కో–ఆప్షన్‌ స్థానాల్లో రెండు మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. కో–ఆప్షన్‌ పదవి కోసం ఇటు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆశీస్సుల కోసం ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. కో–ఆప్షన్‌ స్థానం మాజీ కౌన్సిలర్లకే అవకాశం ఇవ్వాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న కాసుల విజయ కుమారుడు కాసుల రోహిత్‌ మాజీ కౌన్సిలర్‌గా పని చేశారు. ప్రస్తుతం కాసుల విజయకు రాజకీయ అనుభవం లేకపోవడంతో కాసుల రోహిత్‌ కో–ఆప్షన్‌ ఇవ్వాలనే డిమాండ్‌ బలంగా ఉంది. ఇప్పటికే అభ్యర్థులు తమ అర్హతలు, పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ నేతల ప్రసన్నం కోసం పరస్పరం పోటీ పడుతున్నారు. మరి కో–ఆప్షన్‌ ఎవరిని వరిస్తుందో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కో–ఆప్షన్‌ కాకపోతే ఇతర నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పలువురు నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement