లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని మత్తడి పోచమ్మ ఆలయ నిర్మాణానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది మోహిన్ హమ్మద్ ఖాద్రీ రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. అందులో భాగంగా మొదటి విడతగా మంగళవారం కుటుంబ సభ్యుడు ఖాసీఫ్ రూ. 2.50 లక్షలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్, ఉపసర్పంచ్ ప్రసాద్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: విద్యతోనే సమాజ చైతన్యం సాధ్యమవుతుందని ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ జీవన పరిణామ క్రమంలో అనేక రూపాల్లో వివక్ష, అణచివేత ఉండేదని అన్నారు. ఆ వివక్ష, అణచివేతలకు పరిష్కార మార్గాలు చూపిన మహనీయులు మన అందరికి ఆదర్శమన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, ఏపీఆర్‌వో సరిత, అధ్యాపకులు పాల్గొన్నారు.
భిక్కనూరు: క్షయ వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా తెమడ పరీక్షలను నిర్వహించి వైద్య సహకారం అందించాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి ప్రదీప్ అన్నారు. మంగళవారం భిక్కనూరు పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఉన్న క్షయ వ్యాధిగ్రస్తులను కలిసి వారిని వైద్యం అందించడంతో పాటు దోమకొండ ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయించాలని సూచించారు. వైద్యులు యెమిమా, ఎంపీహెచ్‌ఈవో వెంకటరమణ ఉన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ స్టేజీ వద్ద గల మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో అర్హులైన ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. ఇంటర్ సెకండియర్ పూర్తి చేసిన బాలికలు నేరుగా కళాశాలకు వచ్చి సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు. టెన్త్, ఇంటర్‌లతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, మూడు పాస్ సోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు.


