ఖాళీ ఖజానాతో గట్టెక్కేదెట్ల? | - | Sakshi
Sakshi News home page

ఖాళీ ఖజానాతో గట్టెక్కేదెట్ల?

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

ఖాళీ ఖజానాతో గట్టెక్కేదెట్ల?

ఎజెండా అంశాలకు ఆమోదం

తాగునీటి సమస్య పరిష్కారానికి..

కామారెడ్డి టౌన్‌ : ‘‘కామారెడ్డి మున్సిపల్‌ ఖజానా ఖాళీగా ఉంది. ఆదాయానికి మించి ఖర్చులున్నాయి. ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్న ఖర్చుల వల్ల రూ. కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఇలాగైతే పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం? ప్రజలకు ఏం సమాధానం చెబుతాం?’’ అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను, కౌన్సిలర్లను ప్రశ్నించారు. సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ సమక్షంలో బల్దియా సాధారణ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని, ప్రతి విభాగంపై సుదీర్ఘంగా చర్చించారు.

ఆదాయాన్ని పెంచుకోవాలి

మొదట రెవెన్యూ విభాగానికి సంబంధించి అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాములు వివరాలు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 15.69 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్‌కుగాను రూ. 9.10 కోట్లు వసూలైందని తెలిపారు. ప్రభుత్వ భవనాల నుంచి రూ. 8.51 కోట్లు రావాల్సి ఉందన్నారు. కాగా బల్దియా ట్రాన్స్‌కోకు రూ. 15.20 కోట్లు, కాంట్రాక్టర్లకు రూ. 30 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఏటా రూ. 9 కోట్ల ఆదాయం వస్తుంటే నెలకు రూ. 1.80 కోట్లు ఖర్చవుతున్నాయన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌లు, అడ్వర్టైజ్‌మెంట్లు, ఫ్లెక్సీల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని, అనవసర ఖర్చులకు చెక్‌ పెట్టాలని సూచించారు.

పారిశుద్ధ్య నిర్వహణపై నిలదీత

పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని సభ్యులు అధికారులను నిలదీశారు. ప్రస్తుతం 238 మంది కార్మికులు పనిచేస్తున్నారని మేనేజర్‌ రషీద్‌ వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సానిటేషన్‌లో 312, నాన్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో 87 మంది, ఇతర విభాగాలకు 91 మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన తీసుకోవాలని కౌన్సిల్‌ తీర్మానించింది. అనారోగ్యంతో ఉన్న లేదా 60 ఏళ్లు దాటిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. డీజిల్‌ బిల్లులు పక్కదారి పట్టకుండా చూడాలని, బ్యాటరీ ఆటోలు కొనుగోలు చేసి చెత్త సేకరించాలని ఆదేశించారు. పారిశుద్ద్య వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ సిస్టం బిగించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

సమావేశంలో 30 ఎజెండా అంశాలతో పాటు 3 టేబుల్‌ ఎజెండా అంశాలపై చర్చించారు. చైర్‌పర్సన్‌ చాంబర్‌లో రూ. 1.90 లక్షలతో కంప్యూటర్‌, ప్రింటర్‌ కొనుగోలు చేసే అంశాన్ని తిరస్కరించారు. మిగిలిన అంశాలను కౌన్సిల్‌ ఆమోదించింది. స్టేషన్‌ రోడ్డులోని చిరు వ్యాపారుల కోసం మున్సిపల్‌ స్థలాల్లో దుకాణాలు నిర్మించడం, మున్సిపల్‌ మడిగెల అద్దెలు పెంచడం, కొత్త పొక్లెయిన్‌ కొనుగోలుపై తీర్మానాలు చేశారు. అత్యుత్సాహంగా అవగాహన లేకుండా మాట్లాడిన కొందరు సభ్యులకు ఎమ్మెల్యే తనదైన శైలిలో చురకలు అంటించారు. మహిళా కౌన్సిలర్‌లు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశం జరుగుతుండగా కొందరు సభ్యులకు ఫోన్‌లు వస్తున్నాయని, వచ్చే సమావేశం నాటికి కార్యాలయంలో జామర్‌ బిగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి కమిషనర్‌ గిరి, వైస్‌ చైర్‌పర్సన్‌ గోదావరి, వివిధ శాఖల అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై చర్చించారు. 90 కమ్యూనిటీ బోర్ల విద్యుత్‌ బిల్లులను తగ్గించే మార్గాలను చూడాలని అధికారులను ఆదేశించారు. అమృత్‌ జల్‌ పథకం కింద 9 ట్యాంకుల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు.

ఆదాయం రూ. 9 కోట్లు..

ఖర్చులేమో రూ. 20.95 కోట్లు..

అనవసర ఖర్చులు తగ్గించాలి..

మున్సిపాలిటీని ఆదర్శంగా

తీర్చిదిద్దుదాం

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

బల్దియా సాధారణ

సమావేశంలో సుదీర్ఘ చర్చ

Advertisement
 
Advertisement
Advertisement