ఆర్టీసీలో సమ్మె సైరన్‌! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

ప్రధాన డిమాండ్లు..

సంస్థ రక్షణ, డిమాండ్ల

సాధన కోసం పోరుబాట

రేపటినుంచి సమ్మెలోకి..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో చాలాకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ రక్షణ, సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు.

ఒత్తిడిలో కార్మికులు...

కామారెడ్డి డిపోలో 129 బస్సులు, బాన్సువాడ డిపోలో 94, ఆర్మూర్‌ డిపోలో 94 బస్సులు, బోధన్‌లో 118, నిజామాబాద్‌–1 డిపోలో 123, నిజమాబాద్‌–2 డిపోలో 89 కలిపి మొత్తంగా 647 బస్సులు నడుస్తున్నాయి. బస్సులు దాదాపు రోజూ 2.50 లక్షల కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, రూ. కోటిన్నర ఆదాయం వస్తోంది. అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్‌ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 నుంచి 16 గంటల దాకా పనిచేయిస్తున్నారని, స్పెషల్‌ ఆప్‌ కూడా ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. విరామం లేకుండా పనిచేయాల్సి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు.

మరోవైపు బస్సుల్లో 55 మంది ప్రయాణించాల్సి ఉండగా మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక వంద నుంచి 120 మంది దాకా ప్రయాణిస్తున్నారు. దీంతో కండక్టర్లతోపాటు డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల డ్రైవర్లకే టికెట్‌ ఇచ్చే బాధ్యత ఉండడంతో వాహనం నడుపుతూ టికెట్లు ఇవ్వాల్సి రావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిభారంతో కార్మికులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు.

సమరానికి సన్నద్ధం

ఆర్టీసీని రక్షించుకోవడం, సమస్యలు పరిష్కరించుకోవాలన్న లక్ష్యంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమరానికి సన్నద్ధమయ్యారు. బుధవారంనుంచి సమ్మెలో పాల్గొనేందుకు ఆయా డిపోల పరిధిలోని కార్మికులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ తాము ఎందుకు సమ్మెకు వెళాల్సి వస్తోందో వివరిస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.

2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ చేపట్టాలి.

మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు రూ. 400 కోట్లను నెలనెలా విడుదల చేయాలి.

ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత

కల్పించాలి.

ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వరాదు. ఎలక్ట్రిక్‌ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి.

ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.

ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్లర్‌, డ్రైవర్లపై కేఎంపీఎల్‌, ఏపీకే వేధింపులు మానుకోవాలి.

2019 సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేయాలి.

ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి.

సంస్థలో అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement