మహిళలు ఆర్థికంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

మహిళలు ఆర్థికంగా ఎదగాలి జిల్లా ప్రభుత్వ డాక్టర్ల సంఘం కార్యవర్గం ఎన్నిక ‘మద్యం మత్తులో వాహనం నడిపితే జైలుకే..’ కోఆప్షన్‌ పదవులకు రెండు దరఖాస్తులు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి టౌన్‌ : మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా అడిషనల్‌ డీఆర్‌డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. కామారెడ్డి పెద్దబజార్‌లోని కేఆర్‌కే ట్రైనింగ్‌ సెంటర్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్కూల్‌ యూనిఫాం స్టిచ్చింగ్‌పై ఏర్పాటు చేసిన నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు మహిళలకు స్థిరమైన ఉపాధిని కల్పిస్తాయని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షక్షులు మహిళలకు యూనిఫాం కొలతలు, కటింగ్‌, స్టిచ్చింగ్‌, క్వాలిటీ అంశాలపై ప్రాక్టికల్‌గా శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఏపీఎం రాజేందర్‌, కోఆర్డినేటర్‌ సాయిలు, కేఆర్‌కే ట్రస్ట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. 18 కమిటీ సభ్యు ల స్థానాలకు ఒక్కొ క్క నామినేషనే రావ డంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్‌ అధికారి విజయ భాస్కర్‌ ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా డి.శరత్‌, కోశాధికారిగా జి.రాజు, ఉపాధ్యక్షులుగా బి.రేఖ, యాదగిరి, బి.ప్రవీణ్‌ కుమార్‌, జాయింట్‌ సెక్రటరీలుగా ఎస్‌బీ కవిత, పార్థసారథి, యూ.వెంకటేశ్వర్లు, జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులుగా సీహెచ్‌ విజయ్‌రాజ్‌, ఎస్‌.మధుసూదన్‌, ఎస్‌.జ్యోతి, కార్యవర్గ సభ్యులుగా శివప్రసాద్‌, శ్రీనివాస్‌, గౌతమి, సంగీత్‌కుమార్‌, మౌనిక, సమీనా ఎన్నికయ్యారు.

కామారెడ్డి క్రైం : మద్యం మత్తులో వాహనాలు నడిపితే జైలు పాలు కావాల్సి వస్తుందని ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలలో పట్టుబడిన 80 మందిని సోమవారం జిల్లాలోని కోర్టులలో హాజరు పరచగా.. వారికి మొత్తం రూ. 1,22,400 జరిమానా విధించారని పేర్కొన్నారు. ఇందులో ఆరుగురికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించించని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లాలో తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం సోమవారం రెండు దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మాజీ మహిళా కౌన్సిలర్‌ పిడుగు మమతతో పాటు మైనారిటీ నాయకుడు సలీం దరఖాస్తులను సమర్పించారన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని తెలిపారు. మొత్తం నాలుగు కోఆప్షన్‌ పదవులకోసం నోటిఫికేషన్‌ జారీ కాగా.. ఇందులో రెండు మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. ఒక స్థానానికి ఒక దరఖాస్తు చొప్పున నాలుగు దరఖాస్తులే వస్తే ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు. నాలుగుకన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుతం కామారెడ్డి కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు 22 మంది, బీజేపీకి 16 మంది, బీఆర్‌ఎస్‌కు 11 మంది సభ్యులున్నారు. చైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది. కోఆప్షన్‌ పదవులనూ ఆ రెండు పార్టీలే పంచుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లాలో మే 1 నుంచి జూన్‌ 7 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకు అర్హులైన సీనియర్‌ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి రంగ వెంకటేశ్వరగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన కోచ్‌, సహాయ కోచ్‌లకు నెలకు రూ. 7,500, ఖేలో ఇండియా కోచ్‌లకు రూ.5 వేల ప్రోత్సాహకం ఇస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 24 సాయంత్రం 5 గంటల లోపు కలెక్టరేట్‌లోని 223వ నంబర్‌ గదిలో అందజేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement