కౌలు మీద పడేటట్లుంది
పంట ఎండిపోతోంది
● ఎత్తిపోతున్న బోరుబావులు
● ఎండుతున్న పంటలు
● సర్కారు ఆదుకోవాలని రైతుల వినతి
పెద్దకొడప్‌గల్: ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎత్తిపోతున్నాయి. దీంతో సాగు నీరందక పంటలు ఎండుతున్నాయి. పెద్దకొడప్‌గల్ మండలంలోని అంజని, బేగంపూర్‌తో పాటు పలు గ్రామాలలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్షాకాలంలో భారీగా వానలు కురిసి రబీ ప్రారంభం వరకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండడంతో పంటలు బాగుంటాయని రైతులు ఆశించారు. అయితే ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. దీంతో బోరుబావుల్లో ఊట తగ్గుతోంది. ఇప్పటికే పలువురు రైతులు బోర్లు ఎత్తిపోయాయి. బోర్లు ఎత్తిపోతుండడంతో సాగు నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని, ఇప్పుడు పెట్టుబడులూ తిరిగి వచ్చే పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు. సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు.
పది ఎకరాలు కౌలుకు తీ సుకుని పంటలు సాగు చేస్తు న్నా. ఎండలు ఎక్కువవడంతో బోర్లు ఎత్తిపోతున్నయి. ఇ ప్పటికే ఎకరం ముప్పయి గుంటల పొలం ఎండిపో యింది. కౌలు డబ్బులు కూడా మీద పడేటట్లున్నయి.
– అఫ్రోజ్, రైతు, పెద్దకొడప్‌గల్
అంజని గ్రామ శివారులో నాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది. రెండు బోర్లపై ఆధారపడి మూడెకరాలలో వరి, ఎకరంలో జొన్న వేశా. బోరు ఎత్తిపోవడంతో ఎకరం వరి, మరో ఎకరం జొన్న పంట ఎండిపోయాయి.
– గణేశ్, రైతు, లచ్చీరాం తండా


