● మక్క, జొన్న రైతులను ఆదుకోవాలి
● భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్
● గాంధారిలో రాస్తారోకో
గాంధారి: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మక్క, జొన్న రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో సోమవారం మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విఠల్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్‌కు సంబంధించిన మక్కలు, జొన్నలు చేతికి వచ్చాయని, ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో కొందరు రైతులు పంటను దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,400, జొన్నలకు రూ. 3,700 ఉండగా.. దళారులు మక్కలకు రూ. 1,800, జొన్నలకు రూ. 2 వేలే చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేసి రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో బీకేఎస్ నాయకులు శంకర్‌రావు, రావుసాహెబ్ రావు, మాధవరావు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.


