● నిందితుడి అరెస్టు
● రెండు వాహనాలు, ల్యాప్‌టాప్ స్వాధీనం
బోధన్‌టౌన్(బోధన్): వ్యసనాలకు, విలాసాలకు అలవాటుపడి పట్టణంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడు రాహీల్‌ను అరెస్టు చేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాంధారి మండలం పోతంగల్ కలాన్‌కు చెందిన రాహీల్ బాన్సువాడలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో విలాసాలకు అలవాటుపడి డబ్బులు సరిపోక చోరీలకు పాల్పడుతున్నానని నిందితుడు ఒప్పుకున్నాడన్నారు. ఈ నెల 18న అంబం గేట్ వద్ద దుకాణం ఎదుట నిలిచి ఉంచిన బుల్లెట్ వాహనం, 16న గంగారాం ఆస్పత్రి ఎదుట పార్కింగ్ చేసిన బైక్‌ను అపహరించాడు. ఈ నెల 11న ఆచన్‌పల్లి ఏరియాలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్‌ను దొంగిలించాడు. నవంబర్ నెలలో రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బర్దిపూర్–లంగ్డాపూర్ రోడ్డులో వెళుతున్న ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయాడని సీఐ తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి పాల్పడిన రెండు వాహనాలతోపాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు గతంలో అనేక చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని సీపీ అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు.


