బిచ్కుంద(జుక్కల్): మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా బిచ్కుంద పట్టణంలో సోమవారం లింగాయత్ సమాజ్ జెండా ర్యాలీ నిర్వహించారు. మందిరం వద్ద జెండా ఆవిష్కరణ సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా ప్రజలపై దాడి చేశాయి. దీంతో ప్రజలు వాహనాలు వదిలి పరుగులు తీశారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ర్యాలీలో ఏర్పాటు చేసిన డీజే శబ్దాలతోనే తేనెటీగలు గుంపుగా లేచి దాడిచేసినట్లు తెలుస్తోంది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మాక్లూర్: ఆలూర్ మండలం రాంచంద్రాపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. దీంతో సర్పంచ్ తొగరి భూషన్ సోమవారం మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు అనుమానం వ్యక్తంచేశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆలూర్ ఎంపీడీవో గంగాధర్ దగ్ధమైన జీపీ ట్రాక్టర్‌ను పరిశీలించారు. ప్రత్యేక శ్రద్ధతో విచారించి నిందితులను పట్టుకోవాలని ఎస్సై రాజశేఖర్‌తో చెప్పారు.


