కామారెడ్డి టౌన్ : జిల్లాలో జనగణన–2027 విధులకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్నూర్ మండలంలో ఒక ఉపాధ్యాయురాలికి విధులు కేటాయించినప్పటికీ, శిక్షణకు ముందు రోజు కక్షపూరితంగా ఆమె కంటే జూనియర్‌కు ఆ విధులను అప్పగించారని తెలిపారు. ఒక్కో మండలంలో ఒక్కో విధంగా విధులు కేటాయిస్తూ కనీస నిబంధనలు పాటించడం లేదని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా, జనగణన శిక్షణ తరగతులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి రూప్ సింగ్, నాయకులు గోపాల్, భారత్ భాయ్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


