పైసలు ఇచ్చుకో.. కబ్జా చేసుకో..! | - | Sakshi
Sakshi News home page

పైసలు ఇచ్చుకో.. కబ్జా చేసుకో..!

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

ఎలా పండించాలి

కబ్జా చేస్తున్నారు

బాన్సువాడ: చెరువుల కాలువలకు ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలుస్తున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాల్వలు కబ్జాకు గురవుతున్నాయని బాధిత రైతులు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. పట్టణంలోని కల్కి చెరువు పెద్ద తూము నుంచి కాలువ ద్వారా పట్టణం చివర భాగం ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు పోతుంది. చైతన్య కాలనీ, ఎన్‌జీవోఎస్‌ కాలనీల్లోంచి ఈ కాలువ ద్వారా సాగునీరు వెళ్తుంది. ఈ కాలువకు ఇరువైపులా కొందరు రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు. కాసులిస్తే చాలు ఇష్టానుసారంగా ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌)లు ఇచ్చేస్తున్నారు. సాగునీటి కాల్వతో పాటు బఫర్‌జోన్‌కు స్థలం వదిలేసి పనులు చేయాల్సి ఉంది. కానీ ఇవేమీ జరగకుండా వెంచర్లు వెలుస్తున్నాయి. రియల్టర్లు కాల్వలు, చెరువుల స్థలాలను ఆనుకుని కబ్జా చేసి వెంచర్లు చేస్తున్నారు. ఇది రైతులకు శాపంగా మారింది. బాన్సువాడ పట్టణంలో పలు వెంచర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. చివరి ఆయకట్ట వరకు సాగు నీరు వెళ్లాల్సిన కాల్వలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నీరందించే సాగు కాల్వలను కాపాడాల్సిన అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవడంతో రియల్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

స్థలాలను పరిశీలించకుండానే..

ఓ వెంచర్‌ వెలుస్తున్న సమయంలో రియల్టర్లు ముందుగా ఇరిగేషన్‌ శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌వోసీకి దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి కాలువలు, చెరువులకు ఆనుకుని ఉన్నాయా.. బఫర్‌ జోన్‌లోకి ఏమైనా వస్తున్నాయా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎన్‌వోసీని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరుగడం లేదని ఆరోపణలున్నాయి. కార్యాలయంలోనే కూర్చొని రియల్టర్లు ఇచ్చే కాసులకు ఆశపడి ఇష్టారాజ్యంగా ఎన్‌వోసీలు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా బాన్సువాడ పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్లకు ఇలానే ఎన్‌వోసీలు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. గతంలో కాల్వల కబ్జాపై సాక్షి పలు కథనాలు ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి కాలువ పక్కన రియల్టర్లు పాతిన హద్దులను తొలగించి వారికి నోటీసులు జారీ చేసిన ఘటనలున్నాయి. వారం రోజుల క్రితం కల్కి చెరువు కాల్వ కబ్జా అవుతున్న విషయంపై బాధిత రైతులు ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పెద్ద చెరువు (కల్కి చెరువు) పారుకం కింద పంటలు పండించుకుంటున్నాం. ప్రస్తుతం చైతన్య కాలనీలో కాల్వలకు ఆనుకుని హద్దురాళ్లు పాతారు. అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు హద్దు తీసివేయలేదు. భవిష్యత్‌లో పంటకు నీరందించే కాల్వలు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే పంటలు ఎలా పండించుకోవాలి.

–గొల్ల విఠల్‌, రైతు, బాన్సువాడ

కల్కి చెరువు ఆయకట్ట కింద సుమారు 500 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. చెరువు పెద్ద తూము నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీరందుతుంది. కొందరు రియల్టర్లు కాల్వలకు ఇరువైపులా హద్దులు పాతి కాల్వలను కబ్జా చేస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం.

–ముదిరెడ్డి విఠల్‌రెడ్డి, రైతు, బాన్సువాడ

కాసులిస్తేనే ఎన్‌వోసీలు

కాల్వలు, చెరువులు కబ్జా అవుతున్నా పట్టించుకోని అధికారులు

రైతులు ఫిర్యాదు చేసినా స్పందించని ఇరిగేషన్‌ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement