దోమకొండ: మండలంలోని సీతారంపల్లి సబ్‌స్టేషన్ వద్ద శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. సీతారాంపల్లి గ్రామంతో పాటు బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన రైతులు దోమకొండ–బీబీపేట ప్రధాన రహదారిపై సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. వ్యవసాయ బావుల వద్ద 12 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాల్సి ఉండగా, కేవలం 8నుంచి 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పొట్టదశలో ఉన్న వరిపంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంట పాటురోడ్డుపై రెండు గ్రామాల రైతులు ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. చివరకు విద్యుత్‌శాఖ అధికారులు అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను తాము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనడంతో రైతులు ధర్నా విరమించారు.


