అవినీతి తిమింగలాలు! | - | Sakshi
Sakshi News home page

అవినీతి తిమింగలాలు!

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

అవినీతి తిమింగలాలు!

గతంలో సీఐపై ఎకై ్సజ్‌ మంత్రికి ఫిర్యాదు...

రెండు పోస్టుల పేరుతో..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కల్లు, మద్యం దందాలో లొసుగులను ఆసరా చేసుకుని ఆబ్కారీ శాఖ అధికారులు అడ్డగోలుగా దండుకుంటున్నారు. కల్లు ముస్తెదారుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కల్లులో మత్తు పదార్థాలు కలిపారంటూ ఎవరైనా ఆరోపణ చేస్తే చాలు దాడుల పేరుతో మరింతగా దండుకుంటున్నారని తెలుస్తోంది. టెండర్లలో వైన్‌షాప్‌లు దక్కించుకున్న వారి నుంచి కూడా గుడ్‌ విల్‌ పేరుతో ఆబ్కారీ అధికారులు రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. నెలనెలా మామూళ్లు మామూలుగా మారాయి. ఏదైనా సమస్య ఎదురైతే అదనంగా చెల్లించుకోవలసిందే. బిచ్కుంద సర్కిల్‌ పరిధిలోని మద్నూర్‌ మండల కేంద్రంలో కల్లు దుకాణం షిఫ్టింగ్‌ విషయంలో అడ్డగోలుగా డిమాండ్‌ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సీఐ వ్యవహారంతో ఆబ్కారీ శాఖలో అవినీతిపై మరోసారి చర్చ నడుస్తోంది.

కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా డ్రాలో దక్కించుకున్నవారు డిసెంబర్‌ 1 నుంచి వైన్‌షాప్‌లు ప్రారంభించారు. అయితే ఆబ్కారీ అధికారులు వాటి యజమానుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఓ అధికారి తాను ఇన్‌చార్జీగా ఉన్న పోస్టుతో పాటు, తన ఒరిజినల్‌ పోస్టు పేరుతో కలిపి డబుల్‌ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో దుకాణం నిర్వాహకుడు గుడ్‌విల్‌ పేరుతో పైఅధికారులకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. కొన్ని దుకాణాల నిర్వాహకులు రూ. 1.60 లక్షలు, ఇంకొందరు రూ.1.40 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సర్కిళ్లలో పనిచేసే అధికారులు వేరుగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి అంగీకరించకపోతే బెల్ట్‌షాపులను కట్టడి చేయడం, వైన్‌షాప్‌లో సౌకర్యాలు లేవంటూ ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులకు అడిగినంత ముట్టజెబుతున్నట్లు సమాచారం. బిచ్కుంద సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో తమను అధికారుల వేధింపుల విషయాలు బయటికి వస్తున్నాయి.

జిల్లాలో కల్లు తయారీలో మత్తు పదార్థాలను వాడుతారనేది బహిరంగ రహస్యం. అయితే కల్లు ముస్తెదారుల నుంచి ఆబ్కారీ అధికారులు నెలనెలా డబ్బులు వసూలు చేస్తూ దీనిని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఒక్కో దుకాణంనుంచి రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా దండుకుంటున్నారని సమాచారం. అనుమతి లేని దుకాణాల నుంచి రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. కల్తీ కల్లు ఆరోపణలు వచ్చినపుడు దాడులు చేసినట్టే చేసి మరింత దండుకుని వెళ్లడం కామన్‌గా మారిందంటున్నారు. కొన్ని సందర్భాల్లో కల్తీ కల్లుపై మీడియాలో వచ్చే కథనాలు ఆబ్కారీ అధికారులకు కల్పతరువుగా మారుతున్నాయి. కల్తీ కల్లు అమ్మకాల గురించి మీడియాలో వచ్చిందంటూ వసూళ్లు చేస్తున్నారు. కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల షిఫ్టింగ్‌కు అయితే రూ. లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఏసీబీకి పట్టుబడ్డ సీఐ సత్యనారాయణ లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని బిచ్కుంద, మద్నూర్‌ వైన్స్‌ యజమానులు గత సంవత్సరం మద్నూర్‌లో పర్యటించిన ఎకై ్సజ్‌ మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐ వేధింపులపై వైన్స్‌లు బందు చేసి నిరసన తెలిపారు.

ఆబ్కారీ శాఖలో అక్రమార్కులు

వైన్‌షాప్‌లు, కల్లు ముస్తెదారుల నుంచి

భారీగా వసూళ్ల ఆరోపణలు

రూ. 2 లక్షలు తీసుకుంటూ

ఏసీబీకి చిక్కిన బిచ్కుంద సీఐ

Advertisement
 
Advertisement
Advertisement