ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం పోలీసు శాఖ, నేషనల్‌ హైవే అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ’అరైవ్‌ అలైవ్‌’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సాగిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరంగా ప్రాణాలు కాపాడే సీపీఆర్‌ ప్రక్రియపై విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న వారికి ప్రాథమిక చికిత్స ఎలా అందించాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా పోలీసు కళాజాత బృందం తమ ఆటపాటలతో అలరించడమే కాకుండా, ట్రాఫిక్‌ నియమాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న డీఎస్పీ విఠల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం సీఐ తిరుపయ్య, ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అనంతరం హెల్మెట్లను పంపిణీ చేశారు. జుక్కల్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇమ్రోజ్‌, సర్పంచ్‌ శేఖర్‌, ఉప సర్పంచ్‌ ఆవేజ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, డైరెక్టర్‌ షేక్‌ నజీర్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు రామ్‌రెడ్డి, మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బస్టాండులో శుక్రవారం ఎస్సై దీపక్‌కుమార్‌ ప్రయాణికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. సిబ్బంది రమేశ్‌, శ్రీనివాస్‌, లావణ్య, గ్రామస్తులు ముదాం సాయిలు, బైరయ్య, రమేశ్‌, బాలయ్య, అంజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై నరేష్‌ అన్నారు. దేవాయిపల్లి శివారులో కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో పోలీసులు, ఆర్‌టీఏ, ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించారు. మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌, ఏఈ రవితేజ, ఆర్‌టీఏ శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సై అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్‌ ఆవరణలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగహన కల్పించారు. పోలీస్‌ సిబ్బంది వెంకటేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement