● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● పోసానిపేట కొనుగోలు కేంద్రం
పరిశీలన
రామారెడ్డి: ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం పోసానిపేట్‌లోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సన్న ధాన్యం నాణ్యతను, తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి బస్తాకు 40.600 కిలోలకన్నా ఎక్కువ తూకం వేయరాదన్నారు. తూకం ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, తహసీల్దార్ ఉమాలత తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి జనగణనపై శిక్షణ
కామారెడ్డి టౌన్ : జిల్లాలో జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తొలి విడతలో తాడ్వాయి, లింగంపేట్, బిచ్కుంద, మాచారెడ్డి, సదాశివనగర్, జుక్కల్, మద్నూర్, గాంధారి, పిట్లం, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రెండు బ్యాచ్‌లుగా శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ఏవైనా సందేహాలుంటే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.


