ఎల్లారెడ్డి రూరల్: సురక్షిత ప్రయాణం కోసం రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ప్రజలందరికి అవసరమని ఎస్సై మహేశ్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, మరణాల రేటును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రయాణీకులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్‌లు.. డ్రైవర్లు, ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.


