వేసవి కాలం.. దొంగలతో జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

వేసవి కాలం.. దొంగలతో జాగ్రత్త!

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

చోరీలు జరిగే అవకాశం ఎక్కువ

వేరే ఊళ్లకు వెళ్తే సమాచారం

ఇవ్వాలంటున్న పోలీసులు

ఎల్లారెడ్డి: వేసవి కాలం సరదాలనే కాదు.. దొంగల బెడదనూ తెచ్చి పెడుతుంది. చోరీలతో జాగ్రత్త సుమా అని పోలీసులు అంటున్నారు. సెలవుల్లో సొంతూళ్లకు ప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్లటం, ఆరు బయట నిద్రలు చోరీలకు అవకాశం కల్పిస్తుంటాయి. వేరే ఊళ్లకు వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు అంటున్నారు. వేరే ఊళ్లకు వెళ్లేటప్పుడే కాకుండా వేసవి కాలంలో పలువురు తమ ఇళ్లకు తాళం వేసి ఆరుబయట, డాబాలపై నిద్రిస్తుంటారు. తాళం వేయడమే అదనుగా దొంగలు ఇళ్లలో చొరబడి ఉన్నదంతా దోచేస్తారని ఆయన తెలిపారు. గతంలో జరిగిన చోరీ కేసులను పరిశీలిస్తే దొంగలు తాళం వేసిన ఇళ్లనే తమ టార్గెట్‌గా చేస్తుంటారని అన్నారు. ఎవరైనా ఊరు వెళ్లాల్సి వస్తే ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఆయన తెలిపారు.

గోప్యంగా ఉంచితే మేలు..

తాము ఊరు వెళ్తున్న సంగతి ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిదని, సామాజిక మాధ్యమాలలో తమ విహార యాత్రల వివరాలను పోస్ట్‌ చేయవద్దని తెలిపారు. ఇళ్లకు ప్రధాన ద్వారానికి కర్టెన్‌ వేయడం ఉత్తమమని, కర్టెన్‌ కప్పి ఉండటం వల్ల ఇంటికి తాళం వేశారా లేదా అని బయటి నుంచి చూసే వాళ్లకు తెలియకుండా ఉంటుందని తెలిపారు. తాము ఊరు వెళ్లినన్ని రోజులు పేపర్‌, పాల ప్యాకెట్లు వేసే వారికి వాటిని వేయవద్దని తెలపాలని, దొంగలు ఇలాంటి విషయాలనే గమనిస్తుంటారని వివరించారు. ఇంటి ముందు పేపర్లు, పాల ప్యాకెట్లు పడి ఉంటే ఇంట్లో ఎవరూ లేనట్లు దొంగలు నిర్ధారించుకుంటారని తెలిపారు. ఇంట్లో పని చేసేందుకు అపరిచితులను పెట్టుకోవద్దని, నమ్మకమైన తమకు గుర్తు తెలిసిన వాళ్లనే పనికి పెట్టుకోవాలని తెలిపారు. తాము ఊళ్లో లేని రోజుల్లో కూడా ప్రతి రోజూ ఇంటి వాకిలి ఊడ్చి, కళ్లాపి చల్లించేలా పని వాళ్లకు పురమాయించాలి.. వాకిలి ఊడవక పోతే కూడా ఇంట్లో ఎవరూ లేనట్లు దొంగలు గుర్తిస్తారని అన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటు ఉత్తమం..

ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించడం ఉత్తమమని వాటిని తమ సెల్‌ఫోన్లకు అనుసంధానించుకోవాలని, తద్వారా సెల్‌ఫోన్లలో తమ ఇంటి ముందు ఎవరైనా అపరిచితులు తచ్చాడుతుంటే ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు ఇళ్లకు నాసిరకం తాళాలు వేయవద్దని , గేటుకు బయట నుంచి తాళం వేయవద్దని లోపలి నుంచి తాళం వేయాలని తెలిపారు. ఎక్కువ రోజులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపర్చాలని, బీరువా తాళాలను బీరువాలపైనే పెట్టకుండా జాగ్రత్తగా దాచి పెట్టాలని తెలిపారు. ఆరు బయట నిద్రించే సమయంలో ఒంటిపై ఆభరణాలు, విలువైన వస్తువులు ఉంచుకోవద్దని ఆయన తెలిపారు. వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలు జరగే ఆస్కారం ఉండదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement