● కాలనీల్లోనికి రాని
చెత్త సేకరణ వాహనాలు
● రోడ్లపైనే చెత్త వేస్తున్న స్థానికులు
● డంపింగ్‌యార్డులా తయారైన బల్దియా
కామారెడ్డి టౌన్ : మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మున్సిపల్ చెత్త సేకరణ ఆటోలు ప్రతిరోజూ కాలనీల్లోకి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది లేక స్థానికులు ఇళ్లలోని చెత్తను రోడ్ల పక్కనే పడేస్తున్నారు. దీంతో వార్డుల్లోని ప్రధాన రహదారులు, ఖాళీ స్థలాలు డస్ట్‌బిన్‌లుగా మారుతున్నాయి. రోడ్లపై చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఈ చెత్తపై పందులు, పశువులు స్వైరవిహారం చేస్తూ అపరిశుభ్రతను మరింత పెంచుతున్నాయి. దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రావడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. కొన్ని చెత్త సేకరణ ఆటోలు మరమ్మతులు లేక మూలనపడటమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మున్సిపల్‌లో 49 వార్డులకు ప్రస్తుతం నాలుగు వార్డులకు కలిపి కేవలం ఒకే ఆటోను కేటాయించారు. ఫలితంగా ఒక్కో కాలనీకి వారం రోజులకు ఒకసారి మాత్రమే వాహనం వస్తుండటంతో పారిశుద్ధ్య సమస్య తీవ్రమవుతోంది. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, ప్రతిరోజూ చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని, పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం పట్టణంలోని పలు కాలనీల్లో ‘సాక్షి’ పర్యటించగా, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు కెమెరాకు చిక్కాయి.


