వీణకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

వీణకు అభినందనలు

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

వీణకు అభినందనలు ఆర్థిక సహాయం అందజేత ‘ఉద్యమ్‌’ రిజిస్ట్రేషన్‌ పకడ్బందీగా చేపట్టాలి

కామారెడ్డి రూరల్‌: గర్గుల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని కలిగోట వీణ హాకీలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ బుధవారం తన చాంబర్‌లో అభినందించి శాలువాతో సన్మానించారు. ఇటీవల రాంచీ, రాజగిర్‌లో నిర్వహించిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ హాకీ చాంపియన్‌షిప్‌లలో ఆమె అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎంపికై ంది. ఈ ఇండియన్‌ టీం క్యాంప్‌ ఏప్రిల్‌ 19 నుంచి భోపాల్‌లోని ఎస్‌ఏఐ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే జపాన్‌లో జరగనున్న సబ్‌ జూనియర్‌(అండర్‌–18) ఆసియా కప్‌కు భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనుంది. డీఈవో రాజు, పీడీ మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి రూరల్‌: యువ క్రీడాకారిణి కలిగోట వీణ అంతర్జాతీయ స్థాయిలో హాకీ ఆడేందుకు ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణంగా నిలిచిందని సర్పంచ్‌ చింతల దివ్య, ఎంఈవో ఎల్లయ్యలు అన్నారు. బుధవారం గర్గుల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో వీణను సత్కరించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకునే అవకాశాన్ని సాధించడం ఆమె కృషి, పట్టుదల, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా వీణకు అవసరమైన ప్రయాణ, కిట్‌, ఇతర ఖర్చుల నిమిత్తం గర్గుల్‌ గ్రామ సర్పంచ్‌ చింతల దివ్యరవి తేజ గౌడ్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.5 వేల నగదు సహాయం అందజేశారు. గ్రామ అభివృద్ధే కాకుండా యువతలో ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా తాము ఎల్లప్పుడూ ముందుంటామని సర్పంచ్‌ పేర్కొన్నారు. అదేవిధంగా వీణ చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ రూ.10 వేల నగదు అందజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. వీణ లాంటి విద్యార్థులు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని, ఆమె అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హెచ్‌ఎం ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని అన్ని గ్రామాల్లో ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ పకడ్బందీగా చేపట్టాలని అదనపు డీఆర్డివో విజయలక్ష్మి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఐకేపీ సీసీలు, వీవోఏలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉద్యహ రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల గ్రామాల్లోని చిరు వ్యాపారులకు ఎంఎస్‌ఎంఈలో భాగంగా రుణాలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో ఈ నెల 17 నుంచి మే 16 లోపు పూర్తిచేయాలని సూచించారు. ఏపీఎం ప్రసాద్‌, మండల సమాఖ్య అధ్యక్షులు బాలంబాయి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement