భిక్కనూరు: ప్రభుత్వం అన్ని మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎకరాకు 40 క్వింటాళ్లను కొనుగోలు చేయాలని కిసాన్‌మోర్చా మండలాధ్యక్షుడు జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కిసాన్‌మోర్చ ఆధ్వర్యంలో ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పంట దిగుబడి అధికంగా ఉందని ఒక ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వచ్చిందన్నారు. ఎకరాకు 25 క్వింటాళ్ల నిబంధనల వల్ల రైతులు మిగతా మక్కలను దళారులకు విక్రయించాల్సి వస్తోందన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్, నేతలు భాస్కర్‌రెడ్డి, గంగారెడ్డి, రమేష్‌రెడ్డి, వలకొండ రవీందర్‌రెడ్డి, లక్ష్మిదేవునిపల్లి సర్పంచ్ జిల్లెల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ: తెలంగాణ విద్యుత్ ఆర్జిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. వారి సమ్మె బుధవారం 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులు మట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. విద్యుత్ కార్మికులు దత్తు, నివర్తి, కృష్ణ, పండరి, సాయాగౌడ్, ప్రశాంత్, శ్రీకాంత్, సంజులు, బాల్‌రాజ్ తదితరులున్నారు.
భిక్కనూరు: మద్యం మత్తులో వాటర్‌ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. రాజంపేట మండలం బసన్నపల్లిలో గ్రామానికి చెందిన బచ్చన్‌గారి నర్సింలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో తన భార్యతో గొడవపడి మంచినీటి ట్యాంకును ఎక్కా డు. టవల్‌తో ఉరివేసుకొని చనిపోతానని బెదిరిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు డయల్ 100కి సమాచారం అందించటంతో అప్రమత్తమైన రాజంపేట నైట్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు రాజిరెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నర్సింలు పట్టుకొని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. సమయానికి స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపా డిని కానిస్టేబుల్ శ్రీనివాస్,హోంగార్డు రాజిరెడ్డిలను ఎస్పీ రాజేశ్‌చంద్ర,గ్రామస్తులు అభినందించారు.
వేల్పూర్: మండలంలోని లక్కోర గ్రామశివారులో 63 నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ బుధవారం తెలిపారు. లారీ డ్రైవర్లను విచారించగా ఇసుకకు సంబంఽధించిన పత్రాలు ఏమీ లేవని, ఇసుకను కథలాపూర్ మండలంలోని వాగు వద్ద నింపుకొని వచ్చినట్లు తెలిపారని వెల్లడించారు. ఇసుక లారీలను స్వాధీనం చేసుకొని డ్రైవర్లు, లారీ యజమానులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


