● బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బాన్సువాడ: జాబ్‌మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా మన ఊరికే వివిధ కంపెనీల ప్రతినిధులు వచ్చి జాబ్‌మేళాను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ కార్యదర్శి శ్రీకాంత్‌ను సబ్ కలెక్టర్ అభినందించారు. జాబ్‌మేళాకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు అధిక సంఖ్యలో హజరయ్యారు.
41 మందికి ఉద్యోగాలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 41 మందికి ఉద్యోగాలు లభించాయని జిల్లా నోడల్ అధికారి సలాం తెలిపారు. ఐటీ కంపెనీలో ఏడుగురు, ఎంఎస్‌ఎన్ ఫార్మాలో 8 మందికి, విజయ బయో అగ్రికల్చర్‌లో 22 మంది, బ్యాంకింగ్‌లో నలుగురు ఉద్యోగాలు సాధించారు. వివిధ కంపెనీల మేనేజర్లు బ్రహానందరెడ్డి, శర్మ, కమలాకర్, నరేష్, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


