ఎల్లారెడ్డి: పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రావణి (13) బుధవారం వేకువ జామున అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో నిద్ర లేచిన విద్యార్థులకు వాచ్‌మన్ గది డోర్ వద్ద శ్రావణి అపస్మారక స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పర్యవేక్షణ కరువు..
బాలికల హాస్టల్‌పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువయ్యింది. ఇక్కడ పూర్తి స్థాయి వార్డెన్ లేరు. ఇన్‌చార్జి వార్డెన్ ఉండడంతోవిద్యార్థులపై శ్రద్ధ చూపేవారు కరువయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సరైన వసతులు కూడా లేవని పేర్కొంటున్నారు. విద్యార్థి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యతని వారు ఆరోపిస్తున్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ..
విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రే షియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాస్తారోకోలో పాల్గొన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్‌ఎస్ నాయకులు భిక్షాటన చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నేడు ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపు
హాస్టల్‌లో విద్యార్థిని శ్రావణి మరణంపై విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎల్లారెడ్డి బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఎలాంటి అనారోగ్య సమస్యలేని విద్యార్థిని హఠాత్తుగా మరణించడంపై తమకు అనుమానాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బుధవారం నిరసన తెలుపుతున్న నేతలను అరెస్ట్ చేయాలని ఖండించారు. ఎల్లారెడ్డి బంద్‌కు వ్యాపార వర్గాలు సహకరించాలని కోరారు.
భిక్కనూరు: ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో మరణించిన ఎనిమిదో తరగతి విద్యార్థి శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం సాయంత్రం భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నేతలు భారీగా స్టేషన్‌కు తరలివచ్చారు. సురేందర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. అనంతరం పాత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో ఎస్సై ఆంజనేయులు ఆందోళనకారులతో మాట్లాడారు. అయినా వారు రాస్తారోకో విరమించేందుకు అంగీకరించలేదు. దీంతో ఎస్సై సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సూచన మేరకు మాజీ ఎమ్మెల్యేను విడిచిపెట్టడంతో బీఆర్‌ఎస్ నేతలు రాస్తారోకో విరమించారు.


