చట్టసభలకు పరిపూర్ణత | - | Sakshi
Sakshi News home page

చట్టసభలకు పరిపూర్ణత

Apr 16 2026 10:06 AM | Updated on Apr 16 2026 10:06 AM

చట్టసభలకు పరిపూర్ణత

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా అమలు చేసే విషయమై బిల్లు ఆమోదం అయిన నేపథ్యంలో నేటి నుంచి పార్లమెంటులో మూడు రోజుల పాటు చర్చ జరుగనుంది. పార్లమెంటు, శాసనసభలో సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచనున్నందున రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలు 182కు, 17 లోక్‌సభ సీట్లు 26కు పెరుగనున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్‌ జిల్లాలో 15,71,022 మంది జనాభా, కామారెడ్డి జిల్లాలో 9,72,625 మంది జనాభా ఉంది. ఇక గత ఎన్నికల (2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది కాగా, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 88,956 ఎక్కువగా ఉన్నాయి. విడివిడిగా చూసినా కూడా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ మహి ళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే కూడా ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా, ఓట్ల శాతం అధికంగా ఉంది. తాజాగా చేపడుతున్న జనాభా లెక్కల మేర కు ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది.

● రాష్ట్రంలో 182కు అసెంబ్లీ సీట్లు పెరిగితే ఇందులో 60 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. మొత్తంగా జనరల్‌ మహిళలకు 46, ఎస్సీ మహిళలకు 09, ఎస్టీ మహిళలకు 5 సీట్లు దక్కనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సీట్లు 13కు పెరిగితే మహిళలకు 4 నుంచి 5 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా. దీంతో ఇక్కడి నుంచి శాసనసభకు చెప్పుకోదగిన స్థాయిలో మహిళలు అడుగుపెట్టే అవకాశాలపై వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సాక్షి’తో పలువురి అభిప్రాయాలు..

చట్టసభల్లో మహిళలకు పాత్ర కల్పించడంతో ఆయా సభలకు కచ్చితమైన పరిపూర్ణత వస్తుంది. మహిళా సాధికారత విషయంలో ఇది తిరుగులేని పరిణామం. ఇప్పటికే మహిళలు స్వయంశక్తులుగా ఎదగడంలో అన్నిరంగాల్లోనూ సాధిస్తున్న తిరుగులేని విజయాలే నిదర్శనం. అమ్మగా అన్నింటినీ చక్కబెట్టే మహిళలు వ్యవస్థలను చక్కబెట్టడంలోనూ గురుతర బాధ్యతతో వెళతారు.

– డాక్టర్‌ కవితారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement