ఎల్లారెడ్డి డివిజన్‌లో..
● సమస్యకు చెక్ పెట్టేందుకు
ఎన్పీడీసీఎల్ ముందస్తు చర్యలు
● ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణగా
లైట్నింగ్ అరెస్టర్స్ బిగింపు
ఎల్లారెడ్డిరూరల్: వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా పిడుగులు పడ్డప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుంటుంది. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది శ్రమించాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్పీడీసీఎల్ ముందస్తు రక్షణ చర్యలు చేపడుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణగా లైట్నింగ్ అరెస్టర్స్ ఏర్పాటు చేస్తోంది.
కొండ ప్రాంతాలు, పిడుగులు పడే ఏరియాలను గుర్తించి లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని రుద్రారం, సాతెల్లి, మాచాపూర్, ఆజామాబాద్, అన్నాసాగర్ గ్రామాల పరిధిలోని విద్యుత్ స్తంభాలకు లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశాం. పిడుగులు పడ్డా వీటి వల్ల డీటీఆర్‌లకు ఇబ్బంది కలగదు. పిడుగులు నేరుగా భూమిలోకి వెళ్లేలా ఇది చూస్తుంది. దీంతో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉంటుంది.
– విజయసారథి, డీఈ, ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాలున్నాయి. ఆయా మండలాలలో కలిపి 8వేల డీటీఆర్‌లు(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు) ఉన్నాయి. ఏటా పిడుగులు పడ్డప్పుడు పలు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. వాటికి మరమ్మతులు శాఖకు భారంగా మారుతున్నాయి. దీంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు. పిడుగులు పడ్డా నష్టం జరగకుండా ఉండేందుకు లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. పిడుగుల వల్ల వచ్చే హైఓల్టేజీ నేరుగా ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ లైన్లపై పడకుండా భూమిలోకి పంపించే సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌గా ఈ లైట్నింగ్ అరెస్టర్ ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు రక్షణ పొందుతాయని పేర్కొంటున్నారు.


