డిచ్‌పల్లి: నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా బర్థిపూర్ శివారులోని సుగుణ గార్డెన్స్‌లో పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న వారు వ్యక్తిగతంగా వారి కుటుంబాలతోపాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారన్నారు. ఎవరికివారు తమవంతు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్–అలైవ్‌లో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
కొత్త బస్ డిపో..
జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. రవాణాశాఖ పరంగా కూడా చెక్ పోస్టులు ఎత్తివేయడం వంటి అనేక నూతన సంస్కరణలను అమల్లోకి తెచ్చామని గుర్తు చేశారు. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య తదితరులు ప్రసంగించారు.
వాల్‌పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ
రహ్ వీర్, పీఎం రాహత్, హిట్ అండ్ రన్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటు, ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన వాల్ పోస్టర్లను, కర పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ తదితరులు సంతకాలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజల ఆలోచనా విధానంలో
మార్పు రావాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు
స్వీయ నియంత్రణ తప్పనిసరి
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్


