● ప్రాథమిక విచారణ జరిపిన డీఎంహెచ్‌వో
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా వైద్యారోగ్య శాఖలో జరుగుతున్న పరిణామాలపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘వైద్యారోగ్య శాఖలో షాడో ఆఫీసర్’ కథనంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్‌ను ఆదేశించారు. దీంతో ప్రాథమిక విచారణ జరిపి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు డీఎంహెచ్‌వో ఒక ప్రకటనలో తెలిపారు. మాచారెడ్డి పీహెచ్‌సీకి చెందిన సీహెచ్‌వో వై.వెంకటేశ్వర్‌రావు దోమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్నాడని, అయితే అన్నారం పీహెచ్‌సీలో అన్ని విషయాల్లో పేలవమైన పనితీరు ఉన్నందున దాన్ని మెరుగు పరిచే ఉద్దేశంతో ఆయనను డిప్యూటేషన్‌పై పంపించామని నివేదికలో పేర్కొన్నారు.
కాగా అన్నారం పీహెచ్‌సీలో హెచ్‌ఈవోగా పనిచేసిన మంజూర్ అహ్మద్‌ను గతంలో పనిచేసిన డీఎంహెచ్‌వో రాజంపేట పీహెచ్‌సీకి డిప్యూటేషన్‌పై పంపారన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఉద్యోగుల విషయంలో దురుసుగా వ్యవహరించినట్టు తమ దృష్టికి రాలేదని తెలిపారు. తదుపరి విచారణలో ఏమైనా తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


